కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన ఆర్ఎస్పీ

కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన ఆర్ఎస్పీ
నిర్దేశం, హైదరాబాద్ :
బీఎస్పీ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పదే పదే అప్పులు అప్పులు అని ఆరోపణలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ 4 నెలల పాలనలో ఎన్ని అప్పులు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ₹6.71 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేసిందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కానీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు నెలల్లోనే ₹16,400 కోట్ల అప్పు చేసినట్లుగా వార్తలొస్తున్నాయని చెప్పారు. అనధికారికంగా కార్పొరేషన్ల పేరు మీద చేసే అప్పులు దీనికి రెండింతలు ఉంటాయని మాజీ ఐపీఎస్ ఆర్ఎస్పీ అభిప్రాయపడ్డారు. ఆ అప్పులను కాంగ్రెస్ నేతలు రాష్ట్ర బడ్జెట్లలో చూపించరని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ అప్పులు చేసి రాష్ట్రంలో కనీసం మౌళిక సదుపాయాలైనా కల్పించిందని, ప్రస్తుత ప్రభుత్వంలో వాటి ఊసే లేదన్నారు. కాంగ్రెస్ నేతలు కేవలం 6 గ్యారంటీల గారడి మాత్రమే చేస్తున్నారని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే ఈ నాలుగు నెలల్లో మీరు చేసిన అప్పుల మీద కూడా ఏదీ దాచకుండా శ్వేత పత్రం విడుదల చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ‘నేను ఏదో ఆశించి రాజకీయాల్లోకి రాలేదు. ఇది తెలియక కొందరు నన్ను విమర్శిస్తున్నారు. ఒకవేళ పదవులు ఆశించిన వాడిని అయితే, ప్యాకేజ్ లకు లొంగే వాడిని అయితే.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేవాడిని. నాకు ఎటువంటి స్వార్థం లేదు, నా గుండెల్లో బహుజన వాదం ఉంటుంది. రేవంత్ రెడ్డి గతంలో ఆఫర్ ఇస్తే తిరస్కరించాను. మీరు గేట్లు తెరిస్తే చేరుతున్న గొర్రెల మందలో ఒక్కణ్ని నేను కాలేను’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన వైఖరి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పదవి ఆఫర్ చేయగా తిరస్కరించినట్లు బీఆర్ఎస్ లో చేరిన అనంతరం వెల్లడించారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »