నిర్దేశం, న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం జోరందుకుంది. ఇప్పటికే పలువురు నేతలు రాజీనామా చేయగా.. తాజాగా పెద్ద వికెటే పడింది. రాష్ట్ర ఇన్‌ఛార్జ్ పదవికి దీపక్ బబారియా రాజీనామా చేశారు. ఈ విషయమై ఆయన రాహుల్ గాంధీతో మాట్లాడారు. హర్యానాకు వేరొకరిని ఇన్‌చార్జ్‌గా నియమించాలని, తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రాహుల్ గాంధీకి దీపక్ బబారియా చెప్పినట్లు సమాచారం.
దైనిక్ భాస్కర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపక్ బబారియా మాట్లాడుతూ.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిందని చెప్పారు. నిజానికి ఆయన ఇంతకు ముందు బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడ్డారు కూడా. తాజాగా ఆయనకు మళ్లీ కొన్ని న్యూరో సంబంధిత సమస్యలు మొదలయ్యాయట. ఆయన మెదడు శరీరంలోని ఇతర భాగాలతో కనెక్ట్ కాలేదని ఆయనే స్వయంగా చెప్పారు. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరవలసి వచ్చిందని, అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, కానీ కొన్నిసార్లు అది క్షీణిస్తుందని ఆయన అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్ల పంపిణీ సమయంలోనూ దీపక్ బబారియా అస్వస్థతకు గురయ్యారు. రక్తపోటు పెరగడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు.
దీపక్ బబారియాపై ఆరోపణలు
భూపేంద్ర సింగ్ హుడాను వ్యతిరేకిస్తున్న శిబిరంలోని నాయకులు ఇన్‌చార్జి బాధ్యతలను దీపక్ బాబారియా సక్రమంగా నిర్వహించకుండా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని తరచుగా ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కుమారి సెల్జా, రణ్‌దీప్ సూర్జేవాలా నేతల మాటలను దీపక్ బబారియా వినడం లేదని, కేవలం భూపేంద్ర సింగ్ హుడా, ఆయన అనుచరుల మాటల మీదే శ్రద్ధ వహిస్తున్నారని పలువురు నేతలు ఆరోపించారు.
హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 60కి పైగా సాధిస్తుందని ఆశించినప్పటికీ, ఆ పార్టీకి 37 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక బీజేపీ అత్యధికంగా 48 సీట్లు గెలుచుకుని మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది కాకుండా అభయ్ చౌతాలా పార్టీ ఐఎన్ఎల్డీ 2 స్థానాలను గెలుచుకుంది. సావిత్రి జిందాల్‌తో సహా 3 స్వతంత్రులు కూడా గెలిచారు.