‘జమిలి ఎన్నికల’ పై నివేదిక రాష్ట్రపతికి సమర్పించిన కోవింద్‌..

‘జమిలి ఎన్నికల’ పై నివేదిక
రాష్ట్రపతికి సమర్పించిన కోవింద్‌..

నిర్దేశం, ఢిల్లీ:
‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్ని రకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం జరిపింది. ఈ నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించింది. ఈ ఉదయం కోవింద్ సహా కమిటీ సభ్యులు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. జమిలి ఎన్నికలపై 18,629 పేజీల నివేదికను ప్రథమ పౌరురాలికి అందజేశారు.
దాదాపు 190 రోజుల పాటు ఈ అంశంపై కమిటీ అధ్యయనం జరిపింది. పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించింది. అనంతరం నివేదికను రూపొందించింది.
లోక్‌ సభ, శాసన సభ, స్థానిక సంస్థల ఎన్నికలు ఏక కాలంలో నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్‌ను సవరించాలని కమిటీ తమ నివేదికలో సూచించినట్లు తెలుస్తోంది. మూడు స్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని అందులో పేర్కొన్నట్లు సమాచారం.ఏక కాల ఎన్నికల నిర్వహణపై గత కొన్నేళ్లుగా బలంగా ప్రచారం చేస్తున్న మోదీ సర్కారు.. 2023 సెప్టెంబరులో దీనిపై కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను నియమించింది.
కేంద్ర మంత్రి అమిత్‌ షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి, గులాం నబీ ఆజాద్‌, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌, సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, మాజీ చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ సంజయ్‌ కొఠారీ లను కమిటీలో సభ్యులుగా చేర్చింది.
ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, కమిటీ సెక్రెటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్‌ చంద్ర లకు బాధ్యతలు అప్పగించింది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!