ఇక 15 నిమిషాలలో రిజిస్ట్రేషన్
– వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నిర్దేశం, నల్గోండః
తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ సేవలను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రజలకు వేగవంతమైన, అవినీతి రహిత సేవలు అందించేందుకు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కు స్లాట్ బుకింగ్ తో పాటు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నూతన విధానాన్ని అమలు చేస్తామన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న స్థలాల్లో గజం రిజిస్ట్రేషన్ చేసినా కఠిన చర్యలు తప్పవని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. భూముల క్రమబద్దీకరకు ఎల్‌ఆర్‌ఎస్ వేగవంతం చేయాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం ఒక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు దాదాపుగా 45 నిమిషాల నుంచి గంట సమయం పడుతోంది. ఆ సమయాన్ని తగ్గించేందుకు రిజిస్ట్రేషన్ శాఖ స్లాట్ విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానం అమలుల్లోకి వస్తే 15 నిముషాల్లోనే ఒక్కో రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా కొన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
ఈ విధానంతో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు గంటల తరబడి నిరీక్షించే అవకాశం ఉండదన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, చాట్‌బాట్ సేవలు వినియోగించుకుని రిజిస్ట్రేషన్ శాఖను సాంకేతికంగా మార్చాలని మంత్రి పొంగులేటి సూచించారు.నిషేధిత జాబితాలోని ఆస్తులను ఎట్టి పరిస్ధితుల్లో రిజిస్ట్రేషన్ చేయకుండా సబ్ రిజిస్ట్రార్‌లు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. భూభారతి తరహాలో ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను ఏర్పాటు చేసి నిషేధిత ఆస్తుల వివరాలను పొందుపరచి, రెవెన్యూశాఖకు అనుసంధానం చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని నిషేధిత జాబితాలోని గజం స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నిషేధిత జాబితా ఆస్తులలో గజం స్థలం రిజిస్ట్రేషన్ చేసినా క్షణాల్లోనే తన ఆఫీసుతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సమాచారం కనిపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. భూముల క్రమబద్దీకరణపై రిజిస్ట్రార్‌లు ప్రతి రోజు సమీక్షించాలని ఏవైనా సమస్యలుంటే పై అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్‌లో పెట్టకూడదని పేర్కొన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ కోసం ప్రజలు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని నిబంధనలకు తగిన విధంగా ముందుకెళ్లాలని సూచించారు.