రాహుల్ గాంధీ మాటలే మారాయి, కాంగ్రెస్ చేతలు కాదు
– గతంలో తప్పులపై రాహుల్ క్షమాపణ, కానీ నేటికీ అవే తప్పుల్లో కాంగ్రెస్
– రాహుల్ చెప్పే సామాజిక న్యాయం కాంగ్రెస్ లో ఇంకా కనుమరుగే
– వరుస ఓటముల తర్వాత సామాజిక న్యాయం ఎత్తుకున్న రాహుల్
– తన పార్టీలో అమలు చేయడంలో పూర్తిగా విఫలం
నిర్దేశం, హైదరాబాద్:
ఒక దేశంలో ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టాలంటే, వచనాలకన్నా ఆచరణ ముఖ్యమైనది. గతకొంతకాలంగా “పాత తప్పులను గమనించాం, ఇక మార్పే మార్గం” అంటూ పునరుద్ధృతంగా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ కొత్త సీసాలను చూపించినప్పటికీ, అందులో ఉన్న సారా మాత్రం పాతదే అని మాటిమాటికి రుజువు అవుతూనే ఉంది. వ్యవహారాల్లో పాత వ్యవస్థలనే నమ్ముకున్నట్టు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.
టికెట్ల పంపిణీలో పాత గీతలే
2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ చేపట్టిన పునరుత్థాన యత్నాల్లో భాగంగా, రాహుల్ గాంధీ నాయకత్వం మార్పు, సమగ్రత, సామాజిక న్యాయం గురించి తరచూ మాట్లాడారు. కానీ అదే సార్వత్రిక ఎన్నిక సహా గడిచిన అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాలను పరిశీలిస్తే, అగ్రవర్ణానికి చెందిన అభ్యర్థులకే పెద్ద పీట వేశారు. కొన్ని రాష్ట్రాల్లో 65% పైగా టికెట్లు బ్రాహ్మణ, బనియా, రాజపుత్ వర్గాలకు చెందినవారికే ఇచ్చారు. సామాజిక న్యాయం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పిన తర్వాత ఈ తరహా కేటాయింపులు చేయడం ఏంటి? అంటే రాహుల్ ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? లేదంటే ప్రజలకు నీతులు చెప్పి తన సొంత పార్టీని కంట్రోల్ చేయలేకపోతున్నాడా? మొదటిది నిజమైతే మోసగాడు అవుతాడు, రెండోది నిజమైన నాయకుడు అనేదానికి అర్హుడు కాడు.
పార్టీలో నిర్ణయాధికారం అగ్రకులాలకే
పార్టీలో ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాలకు కేవలం ప్రాతినిధ్యంగా హోదాలు మాత్రమే ఇస్తున్నారు తప్పితే వారి చేతులు కట్టేసే ఉంటున్నాయి. కేంద్ర స్థాయిలో ప్రముఖ స్థానాల్లో ఈ వర్గాల నేతల సంఖ్య నేటికీ చాలా తక్కువగా ఉంది. అనేక రాష్ట్రాల్లో ఆయా వర్గాలకు చెందిన నేతలు రెండు, మూడు శతాబ్దాలుగా పార్టీలో సేవలందించినా, వారికి ముఖ్యమైన పోస్ట్‌లు రావడం లేదు. కనీసం వారికి టికెట్లు కూడా అందడం లేదు. ఈ వర్గాల ప్రజలకు పార్టీ దగ్గర సంబంధాన్ని బలోపేతం చేయాలంటే, వారిని నాయకులుగా కాదు, నిర్ణయకర్తలుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికీ వారిని రెండో శ్రేణి నాయకులుగానే చూసే పద్ధతులు కొనసాగుతున్నాయి.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ, బీసీ, ఎస్టీలపై దాడులు
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు గతంలో మాదిరిగానే కొనసాగుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ 2021 డేటా ప్రకారం, ఎస్సీలపై నేరాలు 1.2% పెరిగాయి. ఎస్సీ మహిళలపై అత్యాచార కేసులు 7.64%, అలాగే ఎస్టీలపై 15% ఉన్నాయి. ఈ గణాంకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ సమస్యలు కొనసాగుతున్నాయని సూచిస్తున్నాయి. ఇందులో ఆ సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు టాప్ లో ఉన్నాయి.
రాహుల్ గాంధీ “భారత్ జోడో న్యాయ యాత్ర”ల్లో సామాజిక సమానత్వంపై గొంతు పెద్దది చేసుకుని తెగ మాట్లాడారు. కానీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ, బీసీ, ఎస్టీలపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఉదాహరణకు రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు.. 2023లో ఓ దళిత బాలుడు కుండలో నీళ్లు తాగినందుకు బనియా కులానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు కొట్టి చంపాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపింది. అయితే క్రూరమైన ఆ ఉపాధ్యాయుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోలేదు.
రోహిత్ వేముల యాక్ట్: స్పష్టత లేని హామీ
రాహుల్ గాంధీ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై వివక్షను నిరోధించేందుకు ‘రోహిత్ వేముల యాక్ట్’ను తీసుకువస్తామని ప్రకటించారు. ఈ చట్టం ద్వారా విద్యా సంస్థల్లో దళిత విద్యార్థులపై వివక్షను అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఈ చట్టం రూపకల్పన, అమలు విషయంలో ఇంకా స్పష్టత లేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో ఈ చట్టం అమలుకు సన్నాహాలు ఇంకా పూర్తి కాలేదని సమాచారం. ఈ విషయంలో కాంగ్రెస్ నిబద్ధతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి, అలాగే ఈ హామీ కేవలం రాజకీయ ప్రకటనగానే మిగిలిపోయింది.
కుల గణనపై రాహుల్ గాంధీ హామీలు: ఆచరణలో నీరసం
రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో కుల గణన నిర్వహిస్తామని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ పరిమితిని తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలు కాంగ్రెస్ పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రముఖంగా చోటు చేసుకున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణనను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రకటించింది, మరియు ఈ డేటాను ఉపయోగించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లను స్థానిక ఎన్నికలు, విద్య, ఉపాధి రంగాల్లో అమలు చేసింది. ఈ చర్యను రాహుల్ గాంధీ సామాజిక న్యాయం దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా ప్రశంసించారు.
అయితే, ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో కుల గణన అమలు విషయంలో నీరసం కనిపిస్తోంది. కర్ణాటకలో 2013-18 మధ్య సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్వహించిన కుల గణన డేటాను ఇంకా విడుదల చేయలేదు, ఎందుకంటే లింగాయత్, వొక్కలిగ వంటి ఆధిపత్య కులాల నుంచి వచ్చే వ్యతిరేకతకు భయపడుతున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఏకాభిప్రాయం కుదర్చుకోలేకపోతోందని, మరియు అగ్రకుల నాయకులు కుల గణనకు వ్యతిరేకంగా ఉన్నారని విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ కుల గణనను వ్యతిరేకిస్తూ 2024లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు, ఇది పార్టీ యొక్క చారిత్రక స్థానానికి విరుద్ధమని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ నాయకత్వంపై విమర్శలు
రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు, రాజకీయ విశ్లేషకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం, నిర్ణయాత్మక ప్రక్రియలలో పారదర్శకత లేకపోవడం వంటి అంశాలపై విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు, 2022లో గులాం నబీ ఆజాద్ వంటి సీనియర్ నాయకులు పార్టీని వీడడానికి రాహుల్ గాంధీ చుట్టూ ఉన్న కొందరు సన్నిహితులు నిర్ణయాలను నియంత్రిస్తున్నారని ఆరోపించారు. ఈ అంతర్గత సమస్యలు పార్టీ మాజిక న్యాయ ఎజెండాను అమలు చేయడంలో అడ్డంకులుగా మారుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2014 మరియు 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత, పార్టీ ఓబీసీ ఓటర్లను ఆకర్షించడానికి కుల గణనపై దృష్టి సారించింది, కానీ ఈ వ్యూహం ఇంకా గణనీయమైన రాజకీయ లాభాలను ఇవ్వలేదు. అంతే, రాహుల్ గాంధీ చెప్పే మాటలకు వాస్తవంలో కాంగ్రెస్ లో ఉన్న పరిస్థితికి సంబంధం లేదని ప్రజలు కూడా గ్రహించారు.
ఎస్సీ, బీసీ, ఎస్టీ సంఘాలు రాహుల్ గాంధీ హామీలు ఆచరణలో కనిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక అవకాశాలు, మరియు భద్రతను నిర్ధారించే నిర్దిష్ట విధానాలను అమలు చేయాలని వారు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క చారిత్రక ఇమేజ్‌ను “ద్విజ-ముస్లిం” పార్టీగా భావించే ఓబీసీలను ఆకర్షించడానికి, పార్టీ అంతర్గతంగా సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని రాహుల్ తెలుసుకోవాలి. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం కోసం చేస్తున్న ప్రకటనలు, హామీలు కాంగ్రెస్ పార్టీకి కొంత రాజకీయ దృష్టిని తెచ్చిపెట్టినప్పటికీ, ఈ హామీలు ఆచరణలో కనిపించనంత వరకు కాంగ్రెస్ పార్టీకి రాజకీయ భవిష్యత్ ఉండదు.