ఆదివాసి కుటుంబాలకు పోలీసుల అండ

ఆదివాసి కుటుంబాలకు పోలీసుల అండ

– సకల సమస్యలకు చదువే సర్వరోగ నివారిణి
– ఎల్లవేళలా మీకు అందుబాటులో పోలీస్ శాఖ
– మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్
– రాబిన్ హుడ్ ఆర్మీ యన్.జి.ఓ స్నోమ్యాన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ
– హాజరైన ఆదివాసి గ్రామాల ప్రజానీకం

నిర్దేశం, మంచిర్యాలః

మనకు నిత్య జీవితంలో ఎదురయ్యే సకల సమస్యలకు చదువే సర్వరోగ నివారిణి అని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ అన్నారు. ఈ మేరకు శనివారం తాండూరు మండలంలోని నర్సాపూర్ గ్రామపంచాయితీ లోని బెజ్జల గ్రామంలో పోలీస్ మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వారి వారి వ్యాపారాలు చూసుకుంటూనే ఆదివాసి గ్రామాల ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు వచ్చిన రాబిన్ హుడ్ ఆర్మీ యన్.జి.ఓ స్నోమ్యాన్ ప్రాజెక్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని అభినందించారు.

ప్రభుత్వం అన్ని విధాల సౌకర్యాలు కల్పించినప్పటికీ మన పిల్లలను చదువుకు దూరంగా ఉంచడం సరికాదని ఆయన గ్రామ ప్రజలకు సూచించారు. ఈ దేశ మూలవాసులు ఆదివాసులేనని ఆయన స్పష్టం చేశారు. ఆదివాసీలకు ఉన్న చరిత్ర ఎంతో చారిత్రాత్మకమైనదన్నారు. మన ఆదివాసి గూడాల నుండి చైతన్యవంతుడైన కొమరం బీమ్ ను ఆదర్శంగా తీసుకొని మన పిల్లలను ఎదగనివ్వాలన్నారు. పదవ తరగతి నుండి పై చదువులకు కూడా వసతిగృహాలు అందుబాటులో ఉన్నాయి. కనుక ఉద్యోగం వచ్చేవరకు వారిని చదవమని ప్రోత్సహించాలన్నారు. ఒక గ్రామంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉ ంటే ఆ ప్రభావం ఆ గ్రామం పైన కాకుండా చుట్టుపక్కల గ్రామాల పైన కూడా పడుతుందన్నారు. భవిష్యత్తులో ఈ గ్రామాల నుండి ప్రభుత్వ ఉద్యోగులు రావాలని ఆయన ఆకాంక్షించారు.

ముఖ్యంగా ఇక్కడి ఎస్ఐ, సిఐలు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ గ్రామాల్లో చదువులో రాణిస్తున్న విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధను కనబరచాలని ఆయన సూచించారు. అంతకుముందు ఆదివాసి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అక్కడ ప్రజలను అడిగి తెలుసుకున్నారు.ఎటువంటి కష్టం వచ్చినా ఎల్లవేళలా పోలీస్ శాఖ వారికి అందుబాటులో ఉంటుందని వారు పోలీసులను సంప్రదించాలనిసూచించారు.ఆదివాసులు అసాంఘిక శక్తులకు దూరముగా ఉండాలని ,గ్రామాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు కనిపించిన పోలిసులకు తెలియజేయాలన్నారు.ప్రజలకు కేవలం శాంతిభద్రతల సమస్య కాకుండా ఇతర సమస్యలున్నా నిర్భయంగా పోలీస్ స్టేషన్కు వచ్చి తమ సమస్యలు వివరించి నట్లయితే వాటి పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామన్నారు.

అనంతరం రాబిన్ హుడ్ ఆర్మీ యన్.జి.ఓ మరియు స్నోమ్యాన్ వారు పంపిణీ కోసం తెచ్చిన నిత్యవసర సరుకులు ఆదివాసి గ్రామాల ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రవి కుమార్, తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి,ఎస్సైలు సౌజన్య, కిరణ్ కుమార్,విజయ్,గంగారం, రాబిన్ హుడ్ ఆర్మీ యన్.జి.ఓ వాలంటరీ రమేష్, మాజీ ఎంపీటీసి సూరం రవీందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »