ఆడింది బతుకమ్మ.. చేసింది లిక్కర్ దందా..

ఆడింది బతుకమ్మ..
చేసింది లిక్కర్ దందా..

– తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి దేశ రాజధానిలో అప్రతిష్ట
– లిక్కర్ దందాలో దొరికి కటకటాల పాలు
– కవితకు ఏడు రోజుల కస్టడీ

నిర్దేశం, హైదరాబాద్:
బతుకమ్మను తెలంగాణ మహిళలు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ కాన్సెప్ట్ తో వెళ్ల్లి కల్వకుంట్ల కవిత మహిళలకు దగ్గరయ్యారు.

ఇది నాణానికి ఒకవైపు, కానీ మరోవైపు మహిళలు దేనినైతే అస్యహించుకుంటారో, దేనివల్ల తమ కుటుంబాలు ఆగమవుతున్నాయని ఆందోళన ఉంటుందో, దానినే వ్యాపారంగా ఎంచుకున్నారు కవిత. మద్యం అంటేనే ఆగ్రహం వస్తుంది. మద్యపానం నిషేధించాలని ఉద్యమించిన గడ్డ ఇది. మద్యపానం నిషేధం ఉద్యమంతో 90 వ దశకంలో ఇక్కడి మహిళలకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. కవిత ఈ గుర్తింపును, గౌరవాన్ని మంట గలిపారు. తెలంగాణ మహిళలు చేయని లిక్కర్ దందాని దేశ రాజధాని దిల్లీలో చేసి అడ్డంగా దొరికిపోయారు. కవిత దొరకడమేగాక అవినీతికి వ్యతిరేకంగా పోరాడి, ప్రజల మనసు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన దిల్లీ ఆప్ ప్రభుత్వాన్ని కూడా ఇందులోకి లాగింది. దిల్లీలో ప్రభుత్వ మద్యం దుకాణలుండేవి. ప్రైవేటుకు ఇస్తే బాగుంటుందని, అందుకు అనుగుణంగా లిక్కర్ పాలసీ తయారుచేసి ఆప్ ప్రభుత్వానికి అవినీతి అంటగట్టింది. ఈ కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు ఎదుర్కొంటుండగా, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే జైలులో ఉన్నారు.

కవిత కటకటాల పాలు
కవిత లిక్కర్ కేసులో కటకటాల పాలైంది. శుక్రవారం హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి అరెస్టు చేశారు. ఈ కేసులో ఇది వరకే పలువురు నిందితులు అరెస్టు అయ్యారు.
ఈడీ కస్టడీకి కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం నుంచి ఈనెల 23 వరకు కస్టడీకి అప్పగిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ప్రత్యేక న్యాయమూర్తి నాగ్పాల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎమ్మెల్సీ. ఈ ఏడు రోజులపాటు కవిత ఈడీ కార్యాలయంలోనే ఉండాల్సి ఉంటుంది. ఏడు రోజుల పాటు ప్రశ్నించిన తరువాత ఆమెను ఈ నెల 23న మరోసారి ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెడతారు.
ఈడీ కస్టడీ సమయంలో ఎమ్మెల్సీ కవిత ప్రతిరోజు బంధువులను కలిసేందుకు కోర్టు అనుమతినిచ్చింది. అలాగే తన లాయర్ను కలిసేందుకు కుడా అనుమతినిచ్చింది. ప్రతిరోజు ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరగా న్యాయస్థానం ఆమోదం తెలిపింది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లోని నివాసంలో కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఢిల్లీకి తరలించని విషయం తెలిసిందే. శనివారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టారు.
ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు పేర్కొన్నారు. సౌత్ గ్రూప్ లో రాంచంద్రన్ అనే వ్యక్తి కవిత బినామి అని, ఈ పాలసీ తయారు చేసినందుకు ఆప్ పార్టీకి ఎన్నికల ఫండ్ గా వంద కోట్లు ముట్టజెప్పారని పేర్కొన్నారు.
కవిత భర్తకూ నోటీసులు
కవిత భర్త అనిల్ కు కూడా ఈడీ అధికారులు నోటీసులు అందజేశారు. సోమవారం విచారణకు రావాలని పేర్కొన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!