పేదోడి రైలు..గరీభ్ రథ్ ఎక్స్‌ప్రెస్
ఈ రైలులో ప్రయాణానికి కిలో మీటరుకు కేవలం 68 పైసలు మాత్రమే చార్జీ
హైదరాబాద్, నిర్దేశం:
భారతీయ రైల్వే నిత్యం లక్షలాది మంది గమ్యస్థానాలకు చేరుస్తున్నది. ఇందులో అత్యాధునిక సౌకర్యాలను బట్టి ప్రయాణికుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నది. రైలు స్లీపర్, జనరల్ కోచ్‌లు, చైర్‌కార్, ఏసీ కోచ్‌లలో చార్జీలు ఎక్కువగా ఉంటాయి. అలాగే, వందే భారత్, రాజధాని, శతాబ్ది రైళ్లలోనూ టికెట్ల ధరలు భారీగా ఉంటాయి. అయినా, చాలామంది టికెట్ల ధరలు ఏమాత్రం లెక్క చేయకుండా రైళ్లలో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. రైలు ప్రయాణ వేగం, అందులో అందించే సేవల కారణంగా టికెట్ల ధరలు భారీగా ఉంటాయి.డిమాండ్, సీట్ల లభ్యతను బట్టి కూడా ఆయా రైళ్లలో టికెట్ల ధరలు మారుతూ వస్తుంటాయి. ఇందులో ధరలు కొన్ని సార్లు విమాన టికెట్లతో సమానంగా ఉంటాయి. అయితే, ప్రీమియం రైళ్లలో అందించే సౌకర్యాలతో సమానంగా మధ్య తరగతి, దిగువ ఆదాయ వర్గాల ప్రయాణికులు సైతం ఏసీ కోచ్‌లలో ప్రయాణించేలా ఈ రైలును అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. స్పీడ్ పరంగా ఈ రైలు సైతం వందే భారత్, రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో పోటీపడడం విశేషం. ఇంతకీ ఆ రైలు పేరు ఏంటో చెప్పలేదు కదూ.. అదేనండి గరీభ్ రథ్ ఎక్స్‌ప్రెస్. ఈ రైలులో ప్రయాణానికి కిలో మీటరుకు కేవలం 68 పైసలు మాత్రమే చార్జీ వసూలు చేస్తారు.కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైలు సగటు వేగం గంటకు 66 నుంచి 96 కిలోమీటర్ల వేగం కాగా.. గరీబ్ రథ్ రైలు సగటు వేగం గంటకు 70 నుంచి 75 కిలోమీటర్లు. అలాగే, రైలులో ఫుల్ ఏసీ సౌకర్యం అంటుంది. ఇక చార్జీలు కూడా తక్కువగానే ఉంటాయి. ఈ చార్జీతోనే ఏసీ కోచ్‌లోనే ప్రయాణం చేయొచ్చు. అందుకే ఈ రైలును పేదల రాజధాని ఎక్స్‌ప్రెస్‌గా పిలుస్తుంటారు. తక్కువ ఖర్చుతో ఏసీ కోచ్‌లలో పేదలు ప్రయాణించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రైలును 2006 అక్టోబర్‌లో తొలిసారిగా పట్టాలెక్కించింది. తొలి రైలు బిహార్‌లోని సహర్సా నుంచి అమృత్‌సర్‌కు నడిచిందింది. ప్రస్తుతం ఈ రైలు దేశవ్యాప్తంగా 26 మార్గాల్లో నడుస్తున్నది.ఢిల్లీ-ముంబయి, పాట్నా-కోల్‌కతా తదితర మార్గాల్లో నడుస్తున్నది. ఇక చెన్నై నుంచి ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ మధ్య నడుస్తుండగా.. ఇదే దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ కావడం విశేషం. ఈ రైలు 2075 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. రైలు చెన్నై నుంచి ఢిల్లీకి 28 గంటల 30 నిమిషాల్లో చేరుతుంది. ఈ రైలులో టికెట్ ధర రూ.1500 మాత్రమే. ఇక గరీబ్ రథ్ రైళ్లు ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉంటాయి. దాంతో టికెట్ల పొందడం కష్టమే. ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ మధ్య ఓ గరీబ్ రథ్ రైలు నడుస్తుంది. విశాఖపట్నం – సికింద్రాబాద్ (12739-12740) మధ్య రైలు రాకపోకలు సాగిస్తుంది. అలాగే, సికింద్రాబాద్ నుంచి కర్నాటకలోని యశ్వంత్‌పూర్ (12735-12736) మధ్య మరో రైలు నడుస్తుంది. ఆయా రైళ్లకు ప్రయాణికుల నుంచి ఫుల్ డిమాండ్ ఉన్నది.