రేవంత్ కు అగ్నిపరీక్ష
– తమ పాలనకు రెఫరండం అని ప్రకటించిన సీఎం
– మెరుగైన ఫలితాలు రాకుంటే ఇంటా, బయట సమస్యలు
నిర్దేశం,హైదరాబాద్:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రానున్న పార్లమెంటు ఎన్నికలు సవాల్‌గా మారనున్నాయి. అత్యధిక స్థానాలను కాంగ్రెస్ కు సాధించిపెట్టడం ఆయన ముందున్న ఛాలెంజ్. కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారు ఎవరైనా దీనిని అంగీకరించక తప్పదు. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ. జాతీయ పార్టీగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం పాళ్లు చాలా ఎక్కువ. ఆయన ముఖ్యమంత్రి మాత్రమే కాదు పీసీసీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అరకొర సీట్లతోనే అధికారంలోకి వచ్చింది. ఊహించనన్ని సీట్లు రాకపోయినా పదేళ్ల తర్వాత అధికారం దక్కడం కాంగ్రెస్ అధినాయకత్వానికి ఒకింత ఊరట అని చెప్పాలి.అదే సమయంలో రేవంత్ నాయకత్వంపై పార్టీ హైకమాండ్ ఎనలేని నమ్మకాన్ని ఉంచింది. అందుకే ఏమీ ఆలోచించకుండా, సీనియర్లను పక్కన పెట్టి మరీ కొత్తగా పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిని తొలుత పీీసీసీ అధ్యక్షుడిగా, తర్వాత ముఖ్యమంత్రిగా చేసింది. ఇందులో రాహుల్, ప్రియాంక గాంధీల ప్రమేయాన్ని ఎవరూ కాదనలేరు. తెలంగాణలో సోనియా గాంధీని ప్రభావితం చేయగల నాయకులు ఎవరూ లేకపోవడం కూడా రేవంత్ కు ఒక రకంగా కలసి వచ్చిందనే అనుకోవాల్సి ఉంటుంది.
లేకుంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో గతంలో మాదిరిగా యువనేతలను కాదని, టెన్‌జన్ పథ్ ను ఇన్‌ఫ్లూయెన్స్ చేసి మరీ సీఎం పదవిని తన్నుకుపోయేవారు.కానీ తెలంగాణలో సీనియర్లు ఉన్నప్పటికీ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ అధికారంలోకి తేలేకపోవడంతో ఇక్కడి నేతలకు ఢిల్లీలో అడుగు పెట్టే అవకాశమే లేకుండా పోయింది. తమ వల్లనే అధికారంలోకి పార్టీ వచ్చిందని చెప్పుకునేందుకు ఛాన్స్ కూడా వారికి లేకుండా పోయింది.
అలాంటి పరిస్థితుల్లో రేవంత్ రాకతో పార్టీకి ఊపు వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కొనే నేత రేవంత్ అనే ముద్ర జనంలో పడటంతో పాటు, గత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా రేవంత్ కు కలసి వచ్చి సులువుగానే అందలమెక్కగలిగారు. అయితే ముఖ్యమంత్రి అయిన మూడు నెలల్లోనే అత్యంత కీలకమైన పార్లమెంటు ఎన్నికలు వస్తుండటం కూడా ఆయన పనితీరును అంచనా వేసేందుకు హైకమాండ్ కు ఒక అవకాశం దొరికినట్లయింది. తెలంగాణలో ఉన్న పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలను గెలిపించే బాధ్యత రేవంత్ భుజస్కంధాలపైనే ఉంది.
పీసీసీ అధినేత వేరే వారు ఉంటే ఏదైనా తేడా జరిగితే నెపం వారిపైనే నెట్టే వీలుంది. కానీ ఇక్కడ ఆ ఛాన్స్ లేదు. పీసీసీ చీఫ్ ఆయనే. ముఖ్యమంత్రి కూడా ఆయనే కావడంతో అత్యధిక స్థానాలను తెచ్చిపెట్టే బాధ్యత మాత్రం రేవంత్ పైనే ఎక్కువగా కనపడుతుంది. హైకమాండ్ కూడా ఈ మేరకు ఆయనకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. అత్యధిక స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటే ఓకే.. ఫలితాలు రివర్స్ అయితే మాత్రం కాంగ్రెస్ రాష్ట్ర నేతల నోళ్లు తెరుచుకునే అవకాశాలయితే స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు సీఎం పదవికి వచ్చిన ముప్పు ఏమీ లేకపోయినా పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ లో మాత్రం ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది మాత్రం వాస్తవం.