జగిత్యాల జిల్లాలో ఆన్ లైన్ మోసం
లక్ష పెట్టుబడి పెడితే రోజుకు రెండు వేలు ఇస్తామని మోసం
జిల్లా వ్యాప్తంగా వందలాది మంది బాధితులు
జగిత్యాల, నిర్దేశం:
అమాయక ప్రజల నమ్మకమే పెట్టుబడిగా నయా మోసానికి తెర లేపాడు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఫోటో గ్రాఫర్ కస్తూరి రాకేష్. మెటా ఫౌండ్ అనే ఆన్ లైన్ సంస్థ లో పెట్టుబడి పెడితే లక్షకు రోజుకు రెండు వేల లాభం వస్తుందని నమ్మబలికాడు. మొదట్లో కొందరికి లాభం నమ్మించేలా వ్యవహరించాడు. నిజమేనని భావించిన అమాయక ప్రజలు వందలాది మంది లక్షలాది రూపాయలు ఆన్ లైన్ లో పెట్టుబడి పెట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు జిల్లా వ్యాప్తంగా 1200 మంది వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. కొడిమ్యాల కు చెందిన పది మంది 70 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. రోజులు నెలలు గడిచిన లాభం మాట దేవుడెరుగు అసలు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో మోస పోయామని భావిస్తు రాకేష్ ఇంటికి చేరి ఆందోళనకు దిగారు. రాకేష్ భార్య డయల్ 100 కు కాల్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రాకేష్ ఇంటి వద్ద ఆందోళనకు దిగిన బాధితులను స్టేషన్ కు తరలించి విచారించగా ఆన్ లైన్ మోసం వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నయా మోసం పై ఆరా తీస్తున్నారు.