అయ్యో రేవంత్.. వింత పరిస్థితి ఎదుర్కొంటున్న సీఎం
నిర్దేశం, హైదరాబాద్ః
మతిమరుపు దాదాపు అందరికీ ఉంటుంది. నిజానికి, ఇది అంత పట్టింపు లేని అంశాలపై ఉంటుంది. ఏదైనా మర్చిపోయామంటే, మనకు దాని మీద అంత సీరియస్ నెస్ లేదని అర్థం. ఇది కాకుండా బయోలాజికల్ కారణాల వల్ల కూడా కొందరికి మతిమరుపు వస్తుంది. అది వేరే విషయం. అయితే ఈ మతి మరుపు వల్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. అలా అని మతిమరుపు ఆయనకు అనకుంటున్నారేమో. ఆయన సరిగానే ఉన్నారు. కానీ, అందరూ ఆయనను మర్చిపోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అని వచ్చినప్పుడల్లా ఏదో పేరు పలుకుతున్నారు. ఒకరేమో కిరణ్ కుమార్ అంటారు, ఇంకొకరేమో కేటీఆర్ అంటారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే.. సొంత పార్టీ నేతలు, ఆఖరికి మంత్రులు కూడా ఇలాగే ప్రవర్తిస్తుండడం గమనార్మం.
తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. రేవ్ నాథ్ రెడ్డి అని ఏదో అన్నారు. దీంతో మళ్లీ రేవంత్ పేరు మర్చిపోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. కాచుకుని కూర్చునే బీఆర్ఎస్ సోషల్ మీడియా.. దీన్ని వింత వింతలుగా ఎడిట్ చేస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ మీద సెటైర్లు వేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి పేరు ఏంటి అంటూ పోల్స్ పెడుతున్నారు. ఆప్షన్లలో కొందరు నేతలు చెప్పిన వేరు వేరు పేర్ల వీడియోలను ఎడిట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఎవరూ ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదంటూ సెటైర్లు వేస్తున్నారు.
నిజానికి, ముఖ్యమంత్రి స్థాయి పేరు మర్చిపోవడం మరీ ఆశ్చర్యం. అప్పుడప్పుడు ఇలా జరగడం వేరు. కానీ, రేవంత్ రెడ్డి విషయంలో తరుచూ ఇదే జరుగుతోంది. ప్రమాణ స్వీకారం రోజే.. సీఎస్ శాంత కుమారి పేరు సరిగా పలకలేదు. ఇక అప్పుడు మొదలైన ఈ పేరు మర్చిపోయే ట్రెండ్ నేటికీ కొనసాగుతోంది. పాపం.. ఇంటా, బయటా అందరూ ఈ తప్పిదమే చేస్తున్నారు. రేవంత్ వెన్నంటి ఉండే జూపల్లి కూడా ఆ మధ్య ముఖ్యమంత్రి అని చెబుతూ కేటీఆర్ అన్నారు. జగ్గారెడ్డి కూడా ఇలాగే చేశారు. ఇలాంటివి చూస్తే, కావాలనే వాళ్లలా చేసినట్లు కనిపిస్తుంది. నాయకుల మధ్య ఆధిపత్య పోరు వల్ల ఎదుటి వారిని మాటల్లో తక్కువ చేయడం మామూలే. కానీ, ఇలా మార్చేయడమే ఏమీ బాగోలేదు. ఏదైతేనేం.. దేశంలో ఏ నాయకుడూ ఎదుర్కోలేని ఒక వింత పరిస్థితిని రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. కుర్చీ దిగే వరకు ఇది తప్పేలా లేదు.