రజతోత్సవ సభకు అడగడుగునా అడ్డంకులు
వరంగల్, నిర్దేశం:
గులాబీ పార్టీ పెట్టి 25 ఏళ్లు అయింది. పార్టీ రజతోత్సవ సభను లక్షలాది మందితో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో గ్రాండ్‌గా నిర్వహించాలనుకుంది బీఆర్ఎస్ అధిష్టానం.. ఐతే వరంగల్ గడ్డపై ప్లాన్ చేసిన భారీ బహిరంగసభపై నీలినీడలు కమ్ముకున్నాయి..
ప్రభుత్వం వరంగల్‌లో తాజాగా తీసుకొచ్చిన పోలీస్ యాక్ట్ గులాబీ ఉత్సాహంపై నీళ్లు చల్లిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుపెడుతోన్న బీఆర్ఎస్ రజతోత్సవాలకు బిగ్ ప్లాన్ చేసుకుంది.. ఏప్రిల్ 27న వరంగల్ గడ్డపై భారీ భహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు పార్టీ అధినేత కేసీఆర్.హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 10 లక్షల మందితో రజతోత్సవ మహాసభ నిర్వహించేలా ఏర్పాట్లు మొదలుపెట్టింది ఆ పార్టీ.. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ నిర్వహిస్తున్న మొట్ట మొదటి భారీ బహిరంగ సభ కావడంతో దీనిని విజయవంతం చేసేందుకు గులాబీ శ్రేణులు రెడీ అవుతున్నాయి. భారీ బహిరంగ సభ నిర్వహణకు పార్టీ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ పోలీస్ కమిషనరేట్‌లో లిఖితపూర్వకంగా అనుమతి కోరారు.. ఇంతలోనే బీఆర్ఎస్ పార్టీకి వరంగల్ పోలీసులు షాక్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. BRS రజతోత్సవ బహిరంగ సభ జరగనున్న వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్-30 అమల్లోకి తెచ్చారు పోలీసు అధికారులు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెల రోజులపాటు ర్యాలీలు, సభలు, ఊరేగింపులను నిషేధిస్తున్నట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ ఉత్తర్వులు ఈ నెల 6 నుంచి మే 5వరకు నెల రోజుల పాటు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. దీంతో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహణకు ఆటంకం ఏర్పడింది.. అటు సభ ఏర్పాట్లు, ఇటు జన సమీకరణపై దృష్టిసారించిన గులాబీ లీడర్లు పోలీస్ యాక్ట్‌తో అయోమయంలో పడ్డారంట.. రజతోత్సవ సభకు సమయం తక్కువగా ఉండడంతో వాట్ నెక్ట్స్ అనే విషయమై గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ శ్రేణులతో సమాలోచనలు చేస్తున్నారంట.తమ పార్టీ సిల్వర్ జూబ్లీని అడ్డుకోవాలనే దురుద్ధేశ్యంతోనే పోలీస్ యాక్ట్ తీసుకొచ్చారని గుస్సా అవుతున్న బీఆర్ఎస్ న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.. బహిరంగ సభకు అనుమతి కోరుతూ 10 రోజుల క్రితమే దరఖాస్తు చేసుకున్నామని, కానీ సభను అడ్డుకోవాలన్న కుట్రతోనే పోలీస్ యాక్ట్ తీసుకొచ్చారని అంటున్న బీఆర్ఎస్ ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లనుందని సమాచారం..వరంగల్ బహిరంగ సభకు కోర్టు నుంచి కూడా సానుకూలత రాకపోతే వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధి బయట సభ నిర్వహణపై అన్వేషణ మొదలుపెట్టిందట బీఆర్ఎస్.. అంతేకాదు కరీంనగర్‌లో సిల్వర్ జూబ్లీ సభ నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న కోణంలో సమాలోచనలు చేస్తున్నారట గులాబీ బాస్ కేసీఆర్. అంతే కాకుండా హైదరాబాద్ శివారు ప్రాంతమైన ఘట్ కేసర్‌లో సభ నిర్వహించే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఏప్రిల్ 27కు మరో 20 రోజుల సమయం మాత్రమే ఉండటంతో త్వరితగతిన కోర్టును ఆశ్రయించి ఓ నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అడ్డుంకులు సృష్టించినా పార్టీ సిల్వర్ జూబ్లీ సభను భారీ సక్సెస్ చేసి చూపించాలనే పట్టుదలతో ఉన్నారట బీఆర్ఎస్ నేతలు