నిర్దేశం, ప్యాంగ్యాంగ్: పొద్దున మెలకువ రాగానే బెడ్ మీద ఉండగానే మొబైల్ డేటా ఆన్ చేసి వాట్సాప్, ట్విట్టర్ లాంటివి చూస్తుంటాం. ఇక అప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ లేనిదే జీవితం లేదు. బిల్లు కట్టేందుకు, ఆఫీసు అప్డేట్స్ చూసేందుకు, ఫ్రెండ్స్ తో గడిపేందుకు.. ఒకరకంగా చెప్పాలంటే ఫోన్ అనేది మన శరీరంలో ఒక భాగమైంది. కాసేపు డేటా సిగ్నల్ రాకపోతే ఊపిరి ఆగిపోయినంత పని అయిపోతుంది. అలాంటిది ఒక దేశంలో ఇంటర్నెటే లేదంటే నోరెళ్లబెట్టకుండా ఉంటారా? మన జీవితాలు మొత్తం ఇంటర్నెట్ కి కనెక్ట్ అయిపోయి ఉంటే.. ఆ దేశంలో జీరో ఇంటర్నెట్.
ఆ దేశం మరేదో కాదు.. ఉత్తర కొరియా. వాస్తవానికి ఈ దేశాన్ని ప్రపంచంలో అత్యంత రహస్యమైన దేశంగా పిలుస్తారు. దీనికి కారణం ఇక్కడ కఠినమైన పాలన, బాహ్య ప్రపంచం నుంచి పూర్తిగా ఒంటరిగా ఉండే విధానం. ఈ దేశంలో ఇంటర్నెట్ సదుపాయం చాలా పరిమితంగా ఉంది. అయితే అది సామాన్య ప్రజలకు దాదాపుగా అందుబాటులో ఉండదు. అయితే, ఇంటర్నెట్‌కు బదులుగా అక్కడ లోకల్ నెట్‌వర్క్ అంటే ఇంట్రానెట్ ఉపయోగిస్తారు. ఈ ఇంట్రానెట్‌లో ప్రభుత్వం ఆమోదించిన వెబ్‌సైట్‌లు, సమాచారం మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఇందులో కూడా చాలా పరిమిత సమాచారాన్నే పొందుతారు.
ఉత్తర కొరియా ప్రభుత్వం ఇంటర్నెట్‌ను పరిమితం చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఇవి కొన్ని ప్రధాన కారణాలు.. ఇంటర్నెట్ ప్రజల మనస్సులలో తప్పుడు ఆలోచనలను సృష్టిస్తుందని, ఇది పాలనా వ్యవస్థను బలహీనపరుస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. తమ పౌరులు బయటి ప్రపంచం ప్రభావంలోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. ప్రభుత్వం కోరుతున్న సమాచారం మాత్రమే ప్రజలకు అందేలా చూడాలన్నది ప్రభుత్వ ఆలోచన.
ఇక, ఇంటర్నెట్ వల్ల దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ముప్పు వాటిల్లుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇక్కడి ప్రజలు ఇంటర్నెట్‌ను ఉపయోగించడం నిషేధించారు. ఇంటర్నెట్ లేకపోవడం వల్ల ఉత్తర కొరియా ప్రజలు చాలా నష్టపోవాల్సి వస్తోంది. ప్రపంచంలో జరుగుతున్న సంఘటనల గురించి ప్రజలకు తెలిసే అవకాశం చాలా తక్కువ. ఈ డిజిటల్ ప్రపంచంలో.. ప్రపంచానికి దూరంగా ఉత్తర కొరియా ప్రజలు బుతుకుతున్నారు. ఇది జైలు జీవితానికి ఎంత మాత్రం తక్కువ కాదు.