పైసల్ లేవు కానీ ఫోజులు మస్తున్నై
– ఒక పక్క ఖజానీ ఖాళీ అనుకుంటనే మరో పక్క భారీ ప్రాజెక్టులకు సై
– ఉద్యోగులకు జీతాలియ్యనీకి లేవంటూనే కొత్త పథకాలు షురూ
– కేసీఆర్ లెక్కనే వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
– ఇబ్బందులు ఉన్నప్పుడు ఆర్భాటాలు ఎందుకు?
నిర్దేశం, హైదరాబాద్ః
భారత్ రాష్ట్ర సమితి అధికారం నుంచి దిగిపోయి.. కాంగ్రెస్ ఎక్కినంక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మొదటి మాట ఏంటంటే.. “కేసీఆర్ అన్నీ అప్పులు చేసి పోయిండు, ఇప్పుడు రాష్ట్రాన్ని చక్క దిద్దాలె. ఆర్భాటాలకు పోకుంట ముందుగాల ప్రజల నెత్తి మీద ఉన్న భారాన్ని తగ్గించుకోవాలె” అని. సరే.. అంతకు ముందు ఎన్నికల టైంల మస్త్ హామీలు ఇచ్చిర్రు. అదంటె అధికారంలకు రానీకి ఇచ్చిరనుకోవచ్చు. ఒచ్చినంక అయితే సర్కారు దగ్గర ఎన్ని పైసలున్నయో మొఖమిల్లైంది కదా. మరి ఇప్పుడెందుకు అక్కర్లేని ఆర్భాటాలు?
ఉద్యోగులకు ఇయ్యనీకి లేనప్పుడు ఫోర్త్ సిటీ ఎందుకు?
గురువారం ఒక సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకుంట.. “ఉద్యోగులకు ఇయ్యనీకి పైసల్ లేవు. వాళ్లకు రూ.8000 కోట్లు సర్కార్ బాకీ పడి ఉన్నది. అప్పు తెద్దామన్నా ఏడా పుడ్తలేదు, ఎవడు నమ్ముతలేడు” అని అన్నడు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే పైసల్లేనప్పుడు ఫోర్త్ సిటీకి పైసల్ యాడికెళ్లి వస్తై? అట్లనే కొత్త హైకోర్టు కడుతం అంటున్నడు. అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్కగ లేదు. పైగా, ఇప్పుడున్న హైకోర్టు మంచిగనే ఉన్నది కదా. అంతమాత్రం దానికి కొత్త కోర్టు ఎందుకు? ప్రస్తున్న ఔటర్ రింగు రోడ్డు సాలదా.. మళ్లీ ట్రిపుల్ ఆర్ కు ఇప్పుడు తొందరేం ఒచ్చింది? కత చూస్తుంటే కేసీఆర్ లెక్కనే ఉన్నై రేవంత్ రెడ్డి ఏతులు.
అప్పుల మీద అంత కోపం ఉంటే కొత్త అప్పులెందుకు?
రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేసిండన్నది అందరికీ ఎరికే. అందుకే కేసీఆర్ ను ఓడించిర్రు. అధికారంలోకి ఒచ్చిన నాటి నుంచి రేవంత్ రెడ్డి గుడుక ఇదే ముచ్చట పదే పదే చెప్తనే ఉన్నడు. కేసీఆర్ ను తిడ్తనే ఉన్నడు. అసొంటిది రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అప్పులు చేస్తే ఎట్లా? కేసీఆర్ సర్కార్ 10 ఏండ్లొల్ల 6 లక్షల కోట్ల అప్పు చేస్తే.. రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాదిన్నర 1.5 లక్షల కోట్ల అప్పు చేసింది. కేసీఆర్ కంటే ఎక్కువ అప్పే ఇది. పైగా, మొన్న అసెంబ్లీల దీని గురించి ఒక్క లెక్క చెప్పిర్రు. కేసీఆర్ చేసిన అప్పుల్లో 80 వేల కోట్లు తీర్చనీకి ఈ 1.5 లక్షల కోట్లు అప్పు చేసిర్రట. రూపాయి అప్పు తేర్చనీకి రూ.2 అప్పు చేసిర్రు.
ఇప్పుడు రాజీవ్ యువవికాసం అవసరమా?
ఒక వైపు ప్రభుత్వ అప్పులు కడుతున్నమని చెప్పుకుంట.. మరొకవైపు రాజీవ్ యువవికాసం పేరిట రూ.6,000 కోట్లు ఇస్తమని అంటర్రు. కాంగ్రెస్ కార్యకర్తల కోసమే ఈ పథకం తెచ్చినట్లు రేవంత్ రెడ్డే ఒక సభలో ఒప్పుకున్నడు. అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిరుద్యోగాన్ని తగ్గించనీకి పథకం పెట్టిరన్నమాట. ప్రజలకు పెద్దగా ఉపయోగం లేని ఇలాంటి మస్త్ కతలు ఉన్నై సర్కార్ దగ్గర. ఏదేదో చేస్తమంటరు. హైదరాబాద్ ను లండన్ అని, వరంగల్ ను డల్లాస్ అని.. ఏవేవో అంటున్నరు. కావని తెలిసి కూడా ఇసొంటి మాటలు చెప్పుడు, హామీలు ఇచ్చుడు ఏందో?
అధికారంలోకి ఒస్తే అందరూ అంతే
ప్రతిపక్షంల ఉన్నప్పుడు వేటినైతే చూపుడు వేలుతో చూపించి సూటిపోటి మాటలంటరో.. అధికారంలకు ఒచ్చినంక మళ్లా అవే చేస్తరు. కేసీఆర్ ఏ తప్పులైతే చేసిండని రేవంత్ రెడ్డి వేలెత్తి చూపించిండో ఇప్పుడవే తప్పుడు ఆయన చేస్తున్నడు. పూటకో మాట, రోజుకో ఏషం అన్నట్టున్నది సర్కార్ తీరు. అంత మాత్రం దానికి కేసీఆర్ మీద ఎగిరెగిరి పడుడెందుకు? ఇప్పుడన్న కొంచెం సొయి తెచ్చుకొని మసులుకోవాలె కదా. కానీ, అట్ల మసులు కుంటే జనాలొల్ల చులకనైతం అంటరు. కానీ, ఇలాంటి స్టంట్ ల కారణంగనే కేసీఆర్ ఫాంహౌజ్ కు పరిమితం అవ్వాల్సి ఒచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలె.