అలహాబాద్ ఐఐఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య
నిజామాబాద్, నిర్దేశం:
ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో రెండు రోజుల్లో రెండు విషాదాలు చోటుచేసుకున్నాయి. ఐఐఐటీ అలహాబాద్‌లో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. హాస్టల్ బిల్డింగ్ 5వ అంతస్తు నుంచి కిందకి దూకి బలవన్మరణం చెందాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి మరుసటి రోజు పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉండగా ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. చనిపోయే ముందు తల్లికి వీడియో కాల్ చేసి మాట్లాడినట్లు సమాచారం. అనంతరం కొంత సమయానికే శనివారం రాత్రి అలహాబాద్ లోని ఐఐఐటీ హాస్టల్ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ కు చెందిన విద్యార్థిని మాదాల రాహుల్ చైతన్యగా గుర్తించారు. ఆదివారం రోజు రాహుల్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పగా వారు షాకయ్యారు.ధూమంగంజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అజేంద్ర యాదవ్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ..
విద్యార్థి బిల్డింగ్ మీద నుంచి దూకాడని సమాచారం అందిన వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. రాహుల్ ను ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అతడు చనిపోయాడని నిర్ధారించినట్లు తెలిపారు. పరీక్షలో ఫెయిల్ అయినందుకు రాహుల్ డిప్రెషన్ లోకి వెళ్లాడని పోలీసులు చెబుతున్నారు. ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. ప్రయాగ్‌రాజ్ డీసీపీ అభిషేక్ భారతి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ, “పోలీసు టీమ్ కుటుంబ సభ్యుల నుంచి వివరాలను సేకరిస్తోంది. ఫోరెన్సిక్ నిపుణులు కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నాం” అన్నారు.ఆత్మహత్య చేసుకోవడానికి కొంత సమయానికి ముందు రాహుల్ తల్లి స్వర్ణలతకు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. తమ్ముడిని, నాన్నను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడని ఎన్డీటీవీకి తల్లి స్వర్ణలత తెలిపింది. అతడి నుంచి మెస్సేజ్ రావడం చూసి భయపడి అతనికి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అతడి స్నేహితుడికి ఫోన్ చేయగా.. రాహుల్ గురించి తెలుసుకోవడానికి వెళ్ళాడు. రాహుల్ ఎక్కడ ఉన్నాడని మరొక విద్యార్థిని అడిగాడు వెంటనే కాల్ డిస్‌కనెక్ట్ చేశాడు. 10 నిమిషాల తర్వాత, నాకు తిరిగి ఫోన్ చేసి నా కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని చెప్పాడని ఆమె తెలిపారు.ఆదివారం మధ్యాహ్నం ఇన్‌స్టిట్యూట్‌కి చేరుకోగా, తన కొడుకు మరణ వార్త తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ ఆరు నెలలుగా క్లాసులకు హాజరుకావడం లేదని ఐఐఐటీ నుంచి మాకు సమాచారం రాలేదన్నారు. రాహుల్ గతేడాది JEE మెయిన్స్ పరీక్షలో EWS విభాగంలో ఆలిండియా 52 ర్యాంక్‌ను సాధించాడు. చెవిటి, మూగ అయినప్పటికీ చదువులో చురుకుగా ఉండేవాడు. తరచుగా వీడియో కాల్స్ ద్వారా తన తల్లితో మాట్లాడేవాడని పోలీసులు తెలిపారు.శనివారం రాత్రి ఓ విద్యార్థి బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోగా.. ఆదివారం మరో విద్యార్థి ప్రాణాలు విడిచాడు. మరో బీటెక్ ఫస్టియర్ విద్యార్థి కార్డియాక్ అరెస్ట్ కావడంతో చనిపోయాడు. గంటల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు చనిపోవడంతో అలహాబాద్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో తీవ్ర విషాదం నెలకొంది. .