మోదీకి చెక్.. చాపకింద నీరులా నితిన్ గడ్కరి!

నిర్దేశం, న్యూఢిల్లీ: రాజకీయాల్లో శత్రువుల కంటే మిత్ర శత్రువులే ఎక్కువ ఉంటారు. నిజానికి నాయకులకు అవతలి పార్టీ నుంచి ఉన్న ముప్పు కంటే సొంత పార్టీలోనే ఎక్కువ పొంచి ఉంటుంది. కేటీఆర్ కు అడ్డు హరీష్ రావే, జగన్ కు అడ్డు షర్మిలనే, రేవంత్ కు అడ్డు కాంగ్రెస్ రెడ్లే. ఇక నరేంద్రమోదీకి కూడా భారతీయ జనతా పార్టీలో ఓ ముప్పు ఎప్పటి నుంచో పొంచి ఉంది. ఆ ముప్పు పేరు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి. వాస్తవానికి బీజేపీ సైద్ధాంతిక శాఖ అయిన ఆర్ఎస్ఎస్ అండదండలు గడ్కరికే ఎక్కువ ఉంటాయి. కానీ, కొన్న పరిస్థితుల కారణంగా ఆర్ఎస్ఎస్ కూడా మౌనంగా ఉండాల్సి వచ్చింది. కానీ, తాజాగా బీజేపీ కొంత బలహీన పడడంతో ఆర్ఎస్ఎస్ తన బలాన్ని తట్టి లేపుకుంటోంది. మోదీకి స్థానంలో గడ్కరిని పెట్టేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది.

ప్రధానమంత్రి అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొమ్మని నితిన్ గడ్కరికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి గత పది సంవత్సరాలుగా నితిన్ గడ్కరి మోదీకి పక్కలో బల్లెంగా ఉన్నప్పటికీ మోదీ ఆయనను ఏమీ చేయలేకపోతున్నారు. అందుకు కారణం ఆయనకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అండదండలు ఉండడమే. అయితే 2019లో మోదీ మరోసారి అఖండ మెజారిటీతో ఎన్నికైన తర్వాత నితిన్ గడ్కరి ప్రాధాన్యతను మోదీ తగ్గిస్తూ వచ్చారు. ఒక సమయంలో గడ్కరి తన ఫైలును పక్కన పడేసి “మోదీజీ, మీరు మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే నన్నెందుకు కొనసాగిస్తున్నారు.. కావాలంటే తీసేయండి..” అని అనాల్సి వచ్చింది.

దీనితో మోదీ వెనక్కు తగ్గారు. అయినప్పటికీ నితిన్ గడ్కరి ప్రాధాన్యతను మోదీ తగ్గిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి, కేంద్ర ఎన్నికల కమిటీ నుంచి గడ్కరిని తొలగించడం మరో పెద్ద నిర్ణయం. ఇంతటితో ఆగకుండా, గడ్కరికి పోటీగా మరో మహారాష్ట్ర నేత దేవేంద్ర ఫడ్నవీస్ ను ప్రోత్సహిస్తున్నారు కూడా. ఒక దశలో నితిన్ గడ్కరి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు గడ్కరి. అయితే మోహన్ భాగవత్ ఆయనను బుజ్జగించారు. నిజానికి మోదీ హయాంలో ఉన్న అన్ని మంత్రిత్వ శాఖల్లో అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తున్న శాఖ నితిన్ గడ్కరి హాయాంలోని జాతీయ రహదారుల శాఖ మాత్రమే. నితిన్ గడ్కరికి అజాత శత్రువుగా పేరున్నది. దాదాపు అన్ని పార్టీల నేతలు ఆయనతో సఖ్యతగా ఉంటారు. నిజానికి మోదీ హయాంలో అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప మంత్రులు ఇతర రాజకీయ నాయకులకు అప్పాయింట్మెంట్ ఇవ్వరు. కానీ గడ్కరి ఈ విషయంలో స్వతంత్రంగా వ్యవరిహస్తారు.

నిజానికి, 2024లో మోదీకి మెజారిటీ రాకపోవడంతో నితిన్ గడ్కరి చాలా క్రియాశీలకంగా మారారు. ఆర్ఎస్ఎస్ ఆయనను తన ప్రయత్నాలు తాను చేసుకొమ్మని చెప్పింది. కాని మోదీ గడ్కరి ఎత్తులను వమ్ము చేశారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఏర్పాటు చేయకుండా నేరుగా ఎన్డీఏ మిత్రపక్షాలతో సమావేశం ఏర్పాటు చేసి లోక్ సభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. అయితే పరిస్థితుల్లో మార్పులు వచ్చినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అప్పటికే నితిన్ గడ్కరిని కలిసి తన సహకారాన్ని అందచేస్తానని తెలిపారట. ఇదీ కాకుండా, పార్లమెంటులో మోదీని సమర్థించేవారు కరువయ్యారు. రాజ్ నాథ్ సింగ్ నవ్వుతూ కూర్చుంటున్నారు. తనకు మద్దతుగా నిలిచే స్మృతి ఇరానీ కూడా ఓడిపోవడంతో నిర్మలా సీతారామన్, అనురాగ్ థాకూర్ వంటి తేలికపాటి నేతలపై మోదీ ఆధారపడవలిసి వచ్చింది.

బీజేపీ ఎంపీలు క్రమంగా గడ్కరిని కలుసుకోవడం ప్రారంభించారు. విశ్వసనీయ కథనాల ప్రకారం.. మోదీని 75 సంవత్సరాలు పూర్తయ్యే లోపు తప్పుకొమ్మని ఆర్ఎస్ఎస్ చెప్పినట్లు తెలిసింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో మోదీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు. అమృత కాలం ఆయన విశ్రాంతిలో గడపాల్సి వస్తుంది. ఈ లోపు సంఘ్ పరివార్ గడ్కరిని సిద్దం కమ్మని చెప్పింది. హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తప్పదని తెలిపోయింది. నవంబర్ లో జరిగే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు, ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ ఎన్నికల్లోనూ బిజెపికి పరాజయం తప్పదని అంటున్నారు. దీనితో మోదీని లెక్కచేసే వారి సంఖ్య తగ్గిపోతోంది.

కేంద్రమంత్రివర్గంలో పలువురు మంత్రులు ఈ సారి ఆర్ఎస్ఎస్ సూచించిన వారే. మెజారిటీ తగ్గడంతో మోదీ సంఘ్ పరివార్ మాట వినాల్సి వచ్చింది. బండిసంజయ్ లాంటి వారిని మంత్రివర్గంలో తీసుకోవాల్సి వచ్చింది. యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ లాంటి వారిపై పెత్తనం చలాయిద్దామనుకున్నా సంఘ్ పరివార్ పడనీయడం లేదు. గత నెల మోహన్ భాగవత్ స్వయంగా యోగీ ఆదిత్యానాథ్ వద్దకు వెళ్లి ఆయనకు పూర్తి అండదండలిస్తానని ప్రకటించడంతో మోదీ వెనక్కు తగ్గారు. చివరకు మోదీ బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా తన మనిషిని నియమించుకోలేని పరిస్థితిలో పడ్డారు. గత కొద్ది నెలలుగా బీజేపీ జాతీయ అధ్యక్షపదవి నియామకం పెండింగ్ లో పడింది. ఆరోగ్యమంత్రి అయిన పార్టీ అధ్యక్షుడు నడ్డా నామమాత్రంగా కొనసాగుతున్నారు.

వీటన్నిటి నేపథ్యంలో మోదీ తన రోజులు తానే లెక్కపెడుతూ ఏదో ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారు. నితిన్ గడ్కరి తన రోజులకోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ కార్పోరేట్లు ప్రభుత్వంపై ఆధారపడకూడదని స్పష్టించారు. “మీరు ప్రభుత్వానికి దూరంగా ఉండండి.. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నదన్న దానిపై మీకు ప్రమేయం లేదు. ప్రభుత్వం విషకన్య లాంటిది. తనతో ఎవరు వచ్చినా కబళిస్తుంది” అని హెచ్చరించారు. విషకన్య లాంటి మోదీని కౌగలించుకోకూడదని ఆయన అంబానీ, అదానీలను హెచ్చరిస్తున్నారా? అని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!