– బంగ్లాదేశ్ లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
– సైనిక పాలన కొనసాగొచ్చనే అంచనాలకు తెర
– 16 మంది మండలితో ప్రమాణం చేసిన మహమ్మద్ యూనస్
నిర్దేశం, ఢాకా: తిరుగుబాట్లు, అల్లర్లతో హసీనా ప్రభుత్వం కూలిపోయి సంక్షభంలో ఉన్న బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇన్నాళ్లూ సైనిక పాలనలో ఉన్న బంగ్లాదేశ్‌లో రాత్రి నూతన ప్రభుత్వం ప్రమాణం చేసింది. ముహమ్మద్ యూనస్ దేశానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన గురువారం (ఆగస్టు 08) రాత్రి తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ప్రమాణ స్వీకారం చేశారు. బంగ్లాదేశ్ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి, చీఫ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. హిందువులు, మైనార్టీల భద్రతపై ఫోకస్ చేయాలని సూచించారు.
బంగ్లాదేశ్ లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ ప్రమాణం చేశారు. యూనస్ గురువారం మధ్యాహ్నం పారిస్ నుంచి ఢాకాకు తిరిగి వచ్చి బంగా భవన్ లో రాత్రి ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్షుడు మహ్మద్ సహబుద్దీన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు, కొన్ని రోజుల నుంచి జరుగుతున్న అల్లర్లలో చనిపోయిన వారి కోసం ఒక నిమిషం మౌనం పాటించారు.
ఈ మధ్యంతర ప్రభుత్వ పదవీకాలం ఎన్నాళ్లు ఉంటుందనే విషయంలో క్లారిటీ లేదు. బంగ్లాదేశ్‌లో చెలరేగిన ఆందోళనల కారణంగా మాజీ ప్రధాని షేక్ హసీనా సోమవారం దేశం విడిచి వెళ్లారు. అక్కడితో హింస ఆగిపోలేదు. ఈ పరిస్థితిలో ఢాకా చేరుకున్న వెంటనే హింసా మార్గం వీడాలని దేశ ప్రజలకు యూనస్ విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్‌లో ప్రజలకు రక్షణ కల్పించే ప్రభుత్వం ఏర్పడుతుందని యూనస్ తెలిపారు. కొత్త ప్రభుత్వానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. తన సోషల్ మీడియాలో ‘ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ తీసుకున్న కొత్త అసైన్‌మెంట్‌కు అభినందనలు. హిందువులు, ఇతర మైనారిటీ కమ్యూనిటీల భద్రతకు భరోసా ఇవ్వండి. పరిస్థితి త్వరలో సాధారణ స్థితికి వస్తుందని ఆశిస్తున్నాను. బంగ్లాదేశ్ పౌరుల శాంతి, భద్రత, అభివృద్ధి కోసం మీతో భుజం భుజం కలిపి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని రాసుకొచ్చారు.
సలహా మండలిలో ఎవరు ఉన్నారు?
మహ్మద్ యూనస్‌కు 16 మంది కౌన్సిల్ సభ్యులు సహాయం చేస్తారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నాయకులు ఆసిఫ్ మెహమూద్, నహిద్ ఇస్లాం లను ఈ మండలిలోకి తీసుకున్నారు. ఇంకా సయ్యదా రిజ్వానా హసన్, ఫరీదా అక్తర్, ఆదిలూర్ రెహమాన్ ఖాన్, ఏఎఫ్ఎం ఖలీద్ హుస్సేన్, నూర్జహాన్ బేగం, షర్మిన్ ముర్షిద్, ఫరూఖ్-ఎ-ఆజం, నహీద్ ఇస్లాం, ఆసిఫ్ మహమూద్, సలేహుద్దీన్ అహ్మద్, ఆసిఫ్స్, హసన్ ఆరిఫ్, బ్రిగేడియర్ జనరల్ (రిటైర్డ్) ఎం సఖావత్ హుస్సేన్, సుప్రదీప్ చక్మా, ప్రొఫెసర్ బిధాన్ రంజన్ రాయ్, తౌహిద్ హుస్సేన్ యూనస్ ఈ మండలిలో ఉన్నారు.