నక్సలైట్లు ఆలోచించుండ్రి..
ప్రాణ (హింస) త్యాగాలు వద్దు.. ప్రజా ఉద్యమాలే ముద్దు..
నిజమే.. నక్సలైట్లు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆయుధాలు వీడి ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజలను చైతన్య వంతులను చేసి ఓటు ద్వారా రాజ్యాధికారం చేపట్టడం సాధ్యం కాదా..? అయినా.. విశాలమైన భారత దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం సాధించడం అంతా సులువు కాదేమో..? ఆరు దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్న నక్సలైట్లు ముక్కలు ముక్కలుగా విడి పోవడంతో విప్లవం ఎండమావుల్లా కనిపిస్తోంది. అటు నక్సలైట్లు.. ఇటు పోలీసులు విప్లవం కోసం జరిగిన ఉద్యమంలో ప్రాణాలు పోగోట్టుకున్నోళ్లంతా కూడా పేద ప్రజలే.
నక్సలైట్లు అచూకీ సులభం..
కమ్యూనికేషన్ వ్యవస్థలో వివ్లవాత్మకమైన మార్పులు వచ్చిన నేటి కాలంలో సోషల్ మీడియా డామినేట్ చేస్తోంది. మార్క్స్, లెనిన్, మావో ఆలోచనలతో తుపాకి గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించడానికి యువత సిద్ధంగా లేదేమో..? అయినా.. కమ్యూనికేషన్ వ్యవస్థలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులతో నక్సలైట్లు అచూకీ చాలా సులువుగా కనుగొంటున్నారు. దట్టమైన అడవిలో దాక్కున్న ఎన్ కౌంటర్ లు జరుగడానికి కారణం కమ్యూనికేషన్ వ్యవస్థనే..
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటాలు చేస్తూ ప్రాణాలను త్యాగం చేస్తున్న మీరు (నక్సలైట్లు) మారిన భారత దేశ రాజకీయ సమీకరణలతో మరోసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సెల్ ఫోన్ కు అడిక్ట్ అయిన ప్రజలను విప్లవం బాట వైపు మరల్చడం సాధ్యం కాదేమో..? దీర్ఘకాలిక సాయుధ పోరాటం ద్వారా విప్లవం సాధిస్తామని చెబుతున్న మీరు.. ప్రేక్షక పాత్ర పోషిస్తున్న ప్రజలను సాయుధులుగా తీర్చి దిద్దడం కూడా అసాధ్యమే..
తాజా రాజకీయాలను పరిశీలించి ‘‘బుల్లెట్ వద్దు – బ్యాలెట్ ముద్దు..’’ అనే దృక్పదంతో ప్రజలను చైతన్య వంతులను చేసి రాజ్యాధికారంలోకి రావాలని నక్సలైట్లు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.