జగిత్యాలపై కవిత ఫోకస్

కరీంనగర్, నిర్ధేశం:
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కారు దిగి, కాంగ్రెస్‌లో చేరారు. దీంతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కవిత కసరత్తు మొదలుపెట్టారు. కాలం కలిసి వస్తే కవిత అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తోపాటు.. పదిమంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది. ఉపఎన్నిక అనివార్యమనే ప్రచారం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఉపఎన్నిక వస్తే సిట్టింగ్ స్థానాలను కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టింది.ముఖ్యంగా జగిత్యాలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోకస్ పెట్టారు. పట్టున్న జగిత్యాలలో అధికార పార్టీని ఢీకొట్టాలంటే.. కవిత లాంటి వారే సరైన అభ్యర్థి అని పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే కవిత జగిత్యాల గులాబీ శ్రేణులతో మమేకమయ్యే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా కవిత జగిత్యాలలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కులగణన బీసీల రిజర్వేషన్లపై జగిత్యాల నుంచే ఉద్యమం మొదలవుతుందని స్పష్టం చేశారు. పార్టీని ఎవరు వీడిన నష్టం ఉండదని, రాబోయే కాలం బీఆర్ఎస్ దేనని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నిక వస్తే బరిలో ఉంటానని చెప్పకనే చెప్పారు.జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఉపఎన్నికతో సహా 18 సార్లు ఎన్నికలు జరిగితే.. 13 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. టీఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత.. వరుసగా రెండుసార్లు కారు పార్టీ గెలుచుకుంది. ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపైనే డాక్టర్ సంజయ్ విజయం సాధించారు.‌సంజయ్ ఇటీవల కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రాజకీయ దుమారం చెలరేగింది. బీఆర్ఎస్ తోపాటు జగిత్యాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు కూడా ఆయన పార్టీ మారడాన్ని వ్యతిరేకించారు. పార్టీ పెద్దల జోక్యంతో కాంగ్రెస్‌లో ఆందోళన సద్దుమణిగింది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఆగ్రహంగా ఉంది. ఉప ఎన్నిక వస్తే సంజయ్‌ని ఓడించడమే లక్ష్యంగా కారు పార్టీ కసరత్తు చేస్తుంది.జగిత్యాలలో సామాజికంగా, ఆర్థికంగా.. ఎమ్మెల్యే సంజయ్‌కి గట్టిపట్టు ఉంది. దీంతో బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందులో భాగంగానే కవిత జగిత్యాలపై నజర్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌కు సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్‌కు ఎమ్మెల్సీ ఎల్.రమణ ఉన్నప్పటికీ.. పార్టీ మారిన సంజయ్ కాంగ్రెస్ తరపున బరిలో నిలుస్తే.. బీఆర్ఎస్ నుంచి కవిత పోటీ చేస్తారనే టాక్ ఉందిజైలు నుంచి విడుదలయ్యాక రెండోసారి కవిత జగిత్యాలలో పర్యటించారు.‌ ప్రైవేటు కార్యక్రమాలు, కొండగట్టు అంజన్న దర్శనం అని చెబుతున్నా.. ఉపఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా కవిత పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కవిత అయితేనే జగిత్యాలలో కారు పార్టీకి అనుకూలంగా ఉంటుందని.. మరెవరైనా అక్కడ ప్రయోజనం ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »