ఏఆర్వోలు సమన్వయంతో పకడ్బందీగా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలి
వీడియో కాన్ఫరెన్స్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి
కరీంనగర్, నిర్దేశం:
మెదక్.. నిజామాబాద్.. కరీంనగర్..ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి అన్నారు.
ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సహా 15 జిల్లాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
హైదరాబాద్ నుండి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ ఎన్నికల పరిశీలకులు బుద్ధ ప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్ ఉన్న అన్ని జిల్లాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పోలింగ్ ప్రక్రియ మొదలు. తుది ఫలితాలు వెల్లడి వరకు అందుబాటులో ఉంటూ ఎన్నికలను ఎటువంటి ఇబ్బందులు తలేత్తకుండా పర్యవేక్షించాలని తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. పోలింగ్, కౌంటింగ్ రోజున అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు.
కరీంనగర్ కలెక్టరేట్ నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ హాజరు అయిన రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆయన దృష్టికి పలు వివరాలు తీసుకుని వచ్చారు. 15 జిల్లాల పరిధిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు బ్యాలెట్ బాక్సుల రిసెప్షన్ కేంద్రం కరీంనగర్ లోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేశామని అన్నారు. అన్ని జిల్లాల నుండి బ్యాలెట్ బాక్సులను కరీంనగర్ కి పంపించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసామని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా పోలైన ఓట్ల బ్యాలెట్ బాక్సులను కూడా కరీంనగర్ లోని కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తామని అన్నారు. జిల్లాల వారీగా, గ్రాడ్యుయేట్, టీచర్స్ వారీగా కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, బ్యాలెట్ బాక్సులు సంబంధిత కౌంటర్లలో స్వీకరిస్తామని పేర్కొన్నారు.
ప్రతి పోలింగ్ స్టేషన్ కి సీసీ కెమెరా, వెబ్ కాస్టింగ్ ఏర్పాటుకు ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. వెబ్ కాస్టింగ్ లో సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో కౌంటింగ్ సెంటర్ సిద్ధం చేశామని, సుమారు 23 టేబుల్ లలో గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం ప్రత్యేక బాక్సులను తయారు చేయించామని, ఇదివరకే రెండు దఫాలుగా ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చామని అన్నారు. ఎన్నికల సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నందు అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయి, లక్ష్మి కిరణ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డిఓ మహేశ్వర్ పాల్గొన్నారు.