– ఎన్ఎంసీ చేసిన సర్వేలో విస్తుపోయే నిజాలు
– దేశంలోని సగం విద్యార్థులు మానసిక ఒత్తిడిలోనే
– విద్యా వ్యవస్థ, పని ప్రదేశాలే ప్రధాన కారణం
నిర్దేశం, న్యూఢిల్లీ: మన దేశంలో అత్యంత ఒత్తిడి ఎదుర్కొనేది విద్యార్థులే. కారణం, మన విద్యా వ్యవస్థతో పాటు సామాజిక వ్యవస్థ. అటు విద్యా సంస్థలు, ఇటు కుటుంబ సభ్యులు.. విద్యార్థులను మార్కుల వెంట పరుగెత్తిస్తారు. తమ ఇష్టాలు, ఆలోచనలు వారిపై రుద్దతారు. ఒకవేళ విద్యార్థులు తమ ఇష్టంతో ఒక కోర్స్ తీసుకున్నప్పటికీ.. ర్యాంక్ కొట్టాలి, జాబ్ కొట్టాలంటూ తీవ్ర ఒత్తిడికి గురి చేస్తారు. ఈ కారణంగానే ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంట్లో పని చేస్తా కానీ, బడికి మాత్రం వెళ్లనంటూ పదేళ్ల లోపు పిల్లలు మారాం చేస్తున్నారంటే మన విద్యావ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక తాజాగా నేషనల్ టాస్క్ ఫోర్స్ తన నివేదికను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) చేసిన సర్వేలో మెడికల్ రంగంలో ఉన్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిడిలు ఎదుర్కొంటున్నారో, మానసిక ఒత్తిడికి ఎంత మంది విద్యార్థులు బలి అవుతున్నారో తేటతెల్లం చేసింది. దేశంలో సుమారు 38 వేల మంది విద్యార్థులు అధ్యాపకుల తీసుకున్న అభిప్రాయం ప్రకారం.. మొత్తం విద్యార్థుల్లో సగం మంది మానసిక ఒత్తిడిలో ఉన్నారట. వివిధ అధ్యయనాలలో తేలిన సాధారణ విషయం ఏమిటంటే.. భారతదేశంలోని ఏదైనా వైద్య కళాశాలలో ప్రవేశం పొందాలంటే, చాలా కఠినమైన పోటీ పరీక్షను పాస్ కావాలి.
ఆ తర్వాత మంచి డాక్టర్ కావడం, కుటుంబ అంచనాల భారం, హాస్టల్, పరీక్షలు, వేధింపుల భయం తదితర అంశాలు విద్యార్థులను మానసికంగా కుంగదీస్తున్నాయి. దక్షిణ భారతదేశంలోని ప్రాంతీయ అధ్యయనం ప్రకారం 37% మంది వైద్య విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడితో, 30% ఆందోళనతో, 33% ఒత్తిడితో బాధపడుతున్నారు. మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడు సహాయం కోరడంలో సందేహం, స్నేహితుల నుంచి కౌన్సిలింగ్ తీసుకోవడం, గోప్యంగా ఉంచాలనే మనస్తత్వం, అవగాహన లేకపోవడం, ఇతరుల జోక్యానికి భయపడటం, సమయాభావం, చికిత్సకు అనుకూలమైన వాతావరణం లేకపోవడం, సమస్యల స్వీయ నిర్వహణ ఇవ్వడం లాంటివి విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని సర్వే చెప్పింది.