బీజేపీలో టిక్కెట్ల లొల్లి
పోటీ చేసే అభ్యర్థులలో గెలుపు ఆశలు..
(వయ్యామ్మెస్ ఉదయశ్రీ)
బీజేపీలో టికెట్ల కోసం పోటీ పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ హవాలో ఎంపీగా గెలిచి తీరుతామనే ఆశతో చాలా మంది లోక్ సభకు పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ.. ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య నువ్వా – నేనా అనే రీతిలో మరోసారి ఎన్నికల పోరు జరుగనుంది.
సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు ఖాయం..
గత లోక్ సభ ఎన్నికలలో ఎంపీలుగా గెలిచిన దర్మపురి అరవింద్ (నిజామాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), కిషన్ రెడ్డి (సికింద్రాబాద్), సోయం బాపురావు (ఆదిలాబాద్) లకు బీజేపీ అధిష్ఠాన వర్గం పోటీ చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీజేపీ జాతీయ పెద్దలు కూడా తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
బీజేపీలో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కువే..
లోక్ సభ ఎన్నికలలో పోటీ చేస్తే డబ్బులు ఖర్చు పెట్టడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ హవాలో తప్పకుండా గెలుపు మనదేననే ధీమాలో చాలా మంది బీజేపీ లీడర్లు ఉన్నారు. మహబూబ్ ననగర్, మల్కాజిగిరి, జహీరాబాద్, చేవె్ళ్ల నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య పెరిగింది. కరీంనగర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన ఎంపీ బండి సంజయ్ కు ఎంపీ టికెట్ ఇవ్వొద్దని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణా రెడ్డి, ఆ నియోజకవర్గానికి చెందిన మరో సీనియర్ నేత సుగుణాకర్ రావుతో పాటు పలువురు నేతలు కరీంనగర్ నుంచి పార్లమెంట్ టికెట్ బండి సంజయ్ కు ఇవ్వొద్దని ఫిర్యాదులు చేశారు.
మల్కాజిగిరి టికెట్ కోసం క్యూ..
భారత దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజక వర్గం మల్కాజిగిరి. ఇక్కడి నుంచి పోటీ చేయడానికి బీజేపీ అగ్ర నేతలు పోటీ పడుతున్నారు. గత లోక్ సభ ఎన్నికలలో రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచారు. అయితే.. ఇటీవల సీఎం గా బాధ్యతలు స్వీకారించినందున అతను ఎంపీగా రాజీనామ చేశారు. అయితే… తిరిగి సీఎం గెలిచిన ఎంపీ సీటును తిరిగి కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ముదిరాజ్, బీజేపీ మధ్య ప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జి మురళీధర్ రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, బీసీ నేత తూళ్ల వీరేందర్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్ ఎవరికి వారే తమకు టికెట్ వస్తుందని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే.. బీజేపీలో కీలక వ్యక్తిగా మారిన ఈటెల రాజేందర్ కు అధిష్ఠాన వర్గం టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు పార్టీ వర్గాలు.