అడుసు తొక్కనేలా.. కాలు కడగనేలా?

– ఫ్రీ బస్సుపై విచక్షణా రహితంగా వ్యాఖ్యానించిన కేటీఆర్
– మంత్రి సీతక్క ఆగ్రహంతో ట్విట్టర్ ద్వారా క్షమాపణ

నిర్దేశం, హైదరాబాద్: నోరు ఉంది కదా అని ఏదో ఒకటి వాగడం.. అదికాస్త వివాదమైతే.. అబ్బబ్బే.. నేను వేరే ఉద్దేశంతో అనలేదు, తప్పైతే క్షమించండి అంటూ మాట దాటేయడం రాజకీయాల్లో సర్వసాధారణం అయిపోయింది. వివాదాస్పదంగా అంటుంచితే.. నాయకులు చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి జుగుప్సాకరంగా ఉంటాయి. అంతా చేసి చిన్న క్షమాపణతో దాటేస్తుంటారు. కొందరైతే, ఈ క్షమాపణ వరకు కూడా వెళ్లరు. తన మాటలే వక్రీకరించారంటూ తిరుగు దాడి చేస్తారు. తాజాగా.. అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను చాలా మంది వివాదాస్పద వ్యాఖ్యలు అంటున్నారు కానీ, నిజానికి అవి దుర్మార్గమైన వ్యాఖ్యలే. ప్రత్యర్థులను ఇరుకున పెడదామనో, విమర్శలు చేద్దామనో విచక్షణ మరిచి చేసిన కామెంట్ అది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజానికి ఇదంత విమర్శనాత్మకమైంది కాదు. అలా అని కచ్చితంగా విమర్శకు అతీతం అని కూడా కాదు. కానీ, విమర్శ చేసేప్పుడు పాలకులనే కాదు, ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

బస్సులో అల్లంవెల్లుల్లి పొట్టు తీస్తున్నారని, ఇంకేవో పనులు చేస్తున్నారంటూ కొంత కాలంగా బీఆర్ఎస్ ఐటీ సెల్ ట్రోల్స్ చేస్తోంది. వాటికి సంబంధించిన వీడియోలను నెట్టింట్లో షేర్ చేస్తూ జోకులు వేస్తున్నారు. అంటే గతంలో టికెట్ తీసుకుని ప్రయాణించినప్పుడు ఇలాంటివి జరగలేదా? చిరు వ్యాపారులు తమ బుట్టలను వస్తువులను బస్సుల్లో ఆటోల్లో తీసుకురావడం సర్వసాధారణం. ఇకపోతే.. ప్రయాణ సమయంలో ఖాళీగానే కూర్చుంటారు. తమ పనులు చేసుకుంటే తప్పేముంది? జర్నీ చేసేప్పుడు పక్కకు చూడకుండా కళ్లు మూసుకుని కూర్చోవాలని రూలేమైనా ఉందా? ఇదే విషయాన్ని అసెంబ్లీలో మంత్రి సీతక్క లేవనెత్తారు. మహిళలు తమ పనులు తాము చేసుకుంటే తప్పేంటని, అందుకు వారిని కించపరిచేలా వ్యవహరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనికి మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఒక్కొక్కరికీ ఒక్కో బస్సు పెట్టి డాన్సులు చేసుకోండంటూ హేళనగా మాట్లాడారు. కేటీఆర్ కు కాంగ్రెస్ మీద ఏమైనా అభ్యంతరాలుంటే.. వారికి అలవాటైన భాషలో సెటైర్లు వేయొచ్చు, అవసరమైతే తిట్టొచ్చు. కానీ, ప్రజా రవాణాను ఉపయోగించుకునేది సామాన్యులు. ఆయన మాటలు వారిని కించపర్చేవిగా ఉన్నాయి. ఏదైతేనేం.. మరోసారి సీతక్క ఫైర్ అవ్వడంతో తప్పు తెలుసుకున్న కేటీఆర్.. ట్విట్టర్ ద్వారా క్షమాపణ చెప్పారు. ‘‘నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’’ అని రాసుకొచ్చారు. పదేళ్లు మంత్రిగా వ్యవహరించిన వ్యక్తి.. పలుమార్లు అసెంబ్లీ సభ్యుడు.. ప్రజా ప్రతినిధిగా చట్టంతో పాటు సంస్కారం గురించి కూడా లెక్చర్లు ఇచ్చే నేతలు తామేం మాట్లాడుతున్నామో చూసుకోకపోతే ఎట్లా? ముందు ఏదో ఒకటి వాగి తర్వాత సారీ చెప్తే మాసిపోతుందా? ఇదే వ్యాఖ్యలు నాయకులను సామాన్యులు చేసి సారీ చెప్తే వారు ఊరుకుంటారా?

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!