రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంపై మాట మార్చిన కేసీఆర్

రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంపై మాట మార్చిన కేసీఆర్

– ఆరు నెల‌ల్లో రేవంత్ స‌ర్కార్ కూలుతుంద‌న్న కేసీఆర్
– ఏడాదిన్న‌ర గ‌డిచినా ఏమీ కాలేదు
– కాంగ్రెస్ నేత‌లు ట‌చ్ లో ఉన్న‌ర‌ని కేసీఆర్ అన్నారు
– బీఆర్ఎస్ నేత‌లే కాంగ్రెస్ పార్టీలో చేరారు
– కాంగ్రెస్ వ్య‌తిరేక‌త మీదే ఆధార‌ప‌డ్డ గులాబీ బాస్

నిర్దేశం, హైద‌రాబాద్ః

భార‌త్ రాష్ట్ర స‌మితి పార్టీ అధినేత కేసీఆర్ ​మాట మార్చారు. గతంలో చెప్పిన దానికి ఇప్పుడు భిన్నంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెసు పార్టీ అధికారంలోకొచ్చిన తొలి రోజుల్లో ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, ఆరు నెలల్లో కూలిపోతుందని అన్నారు. ఈ మాట కేటీఆర్​, హరీష్​రావు స‌హా గులాబీ నేత‌లంతా ప‌దే ప‌దే వ‌ల్లించేవారు. ఈ ప్రభుత్వం కూలిపోతే వచ్చేది తమ ప్రభుత్వమేనని, చాలామంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు తమతో టచ్​లో ఉన్నారని కేసీఆర్​ స్వయంగా చెప్పారు.

కాంగ్రెస్ నేత‌లు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని త‌రుచూ అనేవారు. కాని ఆరు నెల‌లు అయిపోయి, నేటికి ఏడాదిన్నర గ‌డిపోయింది. అయినా ఏమీ కాలేదు. పైగా బీఆర్​ఎస్​ నుంచే పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెసు పార్టీలో చేరారు. వారి అనర్హతకు సంబంధించి వాదోపవాదాలు పూర్తయి సుప్రీం కోర్టులో తీర్పు రిజర్వులో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు కేసీఆర్​ ఏమంటున్నారు? ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి రావడం తమకు ఇష్టం లేదంటున్నారు. మరో మూడేళ్ల వరకు అంటే అయిదేళ్ల గడువు పూర్తయ్యే వరకు కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలో ఉంటుందని అన్నారు.

తాము ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి దర్జాగా అధికారంలోకి వస్తామని చెప్పారు. ప్రభుత్వాన్ని కూల్చి తాను సీఎం సీట్లో కూర్చోవడాన్ని ఆయన ఎవరో వేసిన భిక్షగా అభివర్ణించారు. ‘వాడూ వీడూ భిక్ష వేస్తే నేను సీఎం సీట్లో కూర్చోను’ అన్నారు. కాంగ్రెసు ఎమ్మెల్యేలు తన దగ్గరకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అడిగినా తాను మాత్రం దానికి ఒప్పుకోనని అన్నారు. మధ్యలో అధికారాన్ని తీసుకోబోమని, అసెంబ్లీ ఎన్నికల్లోనే తేల్చకుంటామని చెప్పారు.

ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని ట‌చ్ చేయ‌డం వ‌ల్లే కేసీఆర్ కే చెడ్డ పేరు వ‌స్తుంది. అదే కాంగ్రెసు ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటే ప్రజల్లో వ్య‌తిరేక‌త పెరిగి మళ్లీ బీఆర్​ఎస్‌ను గెలిపిస్తారని కేసీఆర్​ అభిప్రాయం కావొచ్చు. ఇక కాంగ్రెసు పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయనే గట్టి నమ్మకంతో కేసీఆర్​ ఉన్నారు. ఉప ఎన్నికల్లో బీఆర్​ఎస్​ గెలుస్తుందని, దాంతో కాంగ్రెసు పార్టీ పరువు పోతుందని, మళ్లీ బీఆర్​ఎస్​ ఇమేజ్​ పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. కాబట్టి కేసీఆర్ చెబుతున్నట్లు రేవంత్​ ప్రభుత్వం అయిదేళ్లు పూర్తి చేసుకుంటుందా? మధ్యలోనే కూలిపోతుందా? అనేది కాలమే చెప్పాలి.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »