నిర్దేశం, హైదరాబాద్: రాజకీయాల్లో ఏదీ రహస్యం కాదు. ఎదుటివారి మీద దాడి చేయడానికో లేదంటే తమను కాపాడుకోవడానికో ప్రతిదాన్ని పబ్లిక్ లైఫ్ లో పెట్టి రాజకీయం చేస్తుంటారు. విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాకుండా, ఏది లేదో అది చెప్పడమే రాజకీయం స్టైల్. కొంత కాలంగా విపక్ష నేత కేసీఆర్ మీద జరుగుతున్న ప్రచారం కూడా ఇలాంటిదే. ఆయనకు ఏదో అయిందని, అందుకే బయటికి రావడం లేదని గిట్టని వాళ్లు అంటున్నారు. ఇక మంత్రి కొండా సురేఖ అయితే మరో నాలుగు అడుగులు ముందుకు వేసి అల్లుడు, కొడుకే ఏదో చేశారని అన్నారు.
కేసీఆర్ కు ఏదో అయిందనడం జోక్
రాజకీయాల్లో ఇలా జరగవని కాదు. ఆనాటి కాలం నుంచి పదవి కోసం, కుర్చీ కోసం కన్నతండ్రులను, తోడబుట్టిన వారిని చిదిమేస్తూనే వస్తున్నారు. కానీ, ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు కాస్తో కూస్తో అనుసరించేవారికి నేటి పరిస్థితి తెలిసే ఉంటుంది. కేసీఆర్ కుబుంబంలో అలాంటి పరిస్థితి ఉందంటే నవ్వి పోతారు. అయితే, ఈ ప్రచారం కూడా అంత ఆరోగ్యం కాదనుకున్నారేమో ఏమో.. సడెన్ గా కేసీఆర్ కెమెరా ముందు క్లిక్ మన్నారు. బీఆర్ఎస్ నేతులు కొందరు ఫాంహౌజ్ కి వెళ్లి కేసీఆర్ ను కలిసి వచ్చారు. వీడియోల్లో కేసీఆర్ దిట్టంగానే కనిపించారు. ఆయన బాగానే ఉన్నారు. నిజానికి ఇలాంటి ప్రచారం కేసీఆర్ మీద జనాల్లో సానుభూతి కల్పించేదే. ఇది పరోక్షంగా ప్రచారం చేస్తున్న వారికే మైనస్.
దూరంగా ఉండడం వ్యూహమే
అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి బయటికి పెద్దగా కనిపించడం లేదు కేసీఆర్. ఉద్దేశపూర్వకంగానే ఆయన బయటికి రావడం లేదని తెలిసిందే. కేంద్ర మంత్రి నుంచి సీఎంగా 10 ఏళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన కేసీఆర్.. తన కంటే రాజకీయంగా ఎంతో చిన్నవాడైన రేవంత్ ముందు విపక్ష నాయకుడిగా ఇష్టం లేకపోవచ్చు. అలాగే, ఎలాగే కేటీఆర్, హరీష్ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. కేసీఆర్ రాకడనే రాజకీయంగా సంచలనం అవ్వాలని ఫాంహౌజ్ లోనే ఉంటుండొచ్చు. అంతదానికి కేసీఆర్ కు ఏదో అయిందని, ఆయననేదో చేశారని ప్రచారం చేస్తే ఎలా?