వెతుక్కోవడమే కదా! (కవిత్వం)

వెతుక్కోవడమే కదా!
జీవితమంటే
మనిషిని మనిషి వెతుక్కోవడమే కదా…

అసలెవరూ లేకుండా
ఎంతని తింటాం
ఏమని నిదురపోతాం
పనులెందుకు చేస్తాం
ఫలితమెందుకు కావాలనుకుంటాం?
అందరూ ఉన్నప్పుడే కదా
ఒంటరి ఉమ్మడి కలలు అర్థమవుతాయి
అందరూ ఉంటేనే కదా
ఏ మనుగడ యుద్ధాలైనా సార్థకమవుతాయి?
ఒకరికొకరు లేకుంటే
కన్నీటికైనా ఏ ఆశ మిగిలి ఉంటుంది
అసలెవరూ లేకుంటే
శూన్యతలో ఒంటరితనం కూడా ఉండదేమో?
ఎవరితో మాట్లాడతాం
ఎవరిని ప్రేమిస్తాం
ఎవరితో తగవులాడతాం
ఎవరిని తిట్టిపోస్తాం?
ఎవరిని నిందిస్తాం
ఎవరి కోసం ఎదురు చూస్తాం
ఎవరికై ఊహా ప్రపంచాలు నిర్మిస్తాం
ఎవరి దోసిళ్ళలో కలలు గుమ్మరిస్తాం?
ఎవరితో నవ్వుకుంటాం
ఎవరి మనసులో పూస్తాం
ఎవరిని బెదిరిస్తాం
ఎవరి కోసమని ఏడుస్తాం?

జీవితమంటే
బతికినంతకాలం మనిషిని మనిషి వెతుక్కోవడమే కదా!

– జి. కళావతి

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!