– 10 ఏళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్ అసంబ్లీకి ఎన్నికలు
– మూడు విడతల్లో నిర్వహిస్తామని ప్రకటించిన ఈసీ
– ఆర్టికల్ 370 రద్దు అనంతరం మొదటి ఎన్నికలు
నిర్దేశం, న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో ఎన్నికల తులిప్ వికసించనుంది. 10 ఏళ్ళ నిరీక్షణకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు బ్రేక్ వేసింది. రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. మొత్తంగా 3 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటగా ఆగస్టు 20న జమ్మూ కాశ్మీర్‌లో ఓటరు జాబితాను విడుదల చేస్తారు. అక్టోబర్ 4న ఇక్కడ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇక.. సెప్టెంబరు 18న మొదటి దశ, సెప్టెంబర్ 25న రెండో దశ, అక్టోబర్ 1న మూడో దశ ఎన్నికలు జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల కోసం జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం 11,838 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలపై జమ్మూకశ్మీర్ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. కొద్ది రోజుల క్రితమే లోక్‌సభ ఎన్నికలు జరగడంతో.. ఆ తర్వాత నుంచి అక్కడి వాతావరణం మారిపోయింది. తొందరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే షెడ్యూల్ విడుదలైంది.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ నామినేషన్లకు చివరి తేదీ ఆగస్టు 27, రెండవ దశకు సెప్టెంబర్ 5, మూడవ దశకు సెప్టెంబర్ 12గా నిర్ధారించారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత మొదటిసారిగా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జమ్మూలో 43 అసెంబ్లీ స్థానాలు, కాశ్మీర్ లోయలో 47 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 సీట్లు షెడ్యూల్డ్ కులాలకి, 9 సీట్లు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేసినట్లు సమాచారం.
ఇక ఎన్నికలకు ముందు జమ్మూ కశ్మీర్ లో పెద్ద ఎత్తున బదిలీలు చోటు చేసుకుంటున్నాయి. పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సహా దాదాపు 200 మంది అధికారులను బదిలీ చేసినట్లు సమాచారం.