మతసామరస్యానికి ప్రతీకగా జమాఅత్-ఎ-ఇస్లామీ హింద్ ఈద్ మిలాప్ కార్యక్రమాలు
నిజామాబాద్ / ఆర్మూర్ / నందిపేట:
పవిత్ర రమజాన్ మాసానంతరం వచ్చిన ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకొని జమాఅత్-ఎ-ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా నందిపేట, ఆర్మూర్ సహా పలు ప్రాంతాల్లో ఈద్ మిలాప్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించరు. మత సామరస్యం, శాంతి, ఐక్యతను చాటే ఉద్దేశంతో నిర్వహించిన ఈ సభలు ప్రజల్లో మంచి సందేశాన్ని ఇచ్చాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతస్థుల మధ్య ఐక్యతకు ఈ సభలు ప్రతీకగా నిలిచాయని పలువురు ప్రశంసించారు.
నందిపేటలో తాహెర్ బిన్ హమ్దాన్ ప్రసంగం…
జమాఅత్-ఎ-ఇస్లామీ హింద్ నందిపేట శాఖ నిర్వహించిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “ఈద్ మిలాప్ లాంటి కార్యక్రమాలు భారతీయ సంస్కృతిలోని గంగా-జమునా తెహజీబ్‌ను ప్రతిబింబిస్తాయి. సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడంలో ఇవి కీలకంగా మారుతున్నాయి” అని పేర్కొన్నారు.
ఆర్మూర్‌లో రాజకీయ, మత నాయకుల భాగస్వామ్యం….
ఆర్మూర్ సైదాబాద్ కాలనీలోని షాదీఖానాలో నిర్వహించిన ఈద్ మిలాప్ సభలో కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పి. విన్నయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
అయన మాట్లాడుతూ – “ఈద్ మిలాప్ సభలు ప్రజల మధ్య మానవత్వాన్ని, ప్రేమను పెంపొందించే అవకాశాలు కల్పిస్తాయి. కొన్ని పార్టీలు విద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ మాత్రం ‘నఫ్రత్ కే బజార్ మే మోహబ్బత్ కి దుకాన్’గా నిలుస్తోంది. ‘జై బాపూ – జై భీమ్ – జై సాంవిధానం’ నినాదాలతో ఐక్యతకు కృషి చేస్తోంది” అని అన్నారు.
ఇస్లాం అపోహలను తొలగించిన జమాఅత్ నాయకులు..
ఈ సభలో జమాఅత్ నాయకులు అబ్దుల్ రెహ్మాన్ దవూది, షేక్ హుస్సేన్, మంజూర్ మొహియుద్దీన్ తదితరులు ప్రసంగించారు.
– “ఈద్ మిలాప్ సభల ద్వారా మతాల మధ్య గౌరవాన్ని, స్నేహాన్ని పెంపొందించాలి. రమజాన్ ఉపవాసాల ద్వారా ముస్లింలు పేదల బాధలను అర్థం చేసుకుంటారు. ఇస్లాం ధర్మం శాంతి, న్యాయం, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తుంది” అన్నారు.
“జమాఅత్-ఎ-ఇస్లామీ హింద్ గత ఎనభై ఏళ్లుగా దేశవ్యాప్తంగా మతసామరస్యాన్ని, సామాజిక సమతా దృక్పథాన్ని ప్రజల్లో వ్యాపింపజేస్తోంది” అన్నారు.
అన్నివర్గాల ప్రజల నుంచి మద్దతు….
ఈ కార్యక్రమాల్లో స్థానిక రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సభల అనంతరం ముస్లింలతో పాటు హిందూ, క్రిస్టియన్ మతస్థులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్నేహభావాన్ని చాటుకున్నారు. రాబోయే తరాలకి మతాల మధ్య ప్రేమ, గౌరవం ఎలా ఉండాలనే దానికి ఈ సభలు ఉత్తమ మార్గదర్శకాలుగా నిలిచాయి.