నిర్దేశం, హైదరాబాద్: ఒసామా బిన్‌లాడెన్ గుర్తుండే ఉంటాడు? ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఈ ఉగ్రవాదిని అమెరికా హతమార్చింది. పాకిస్థాన్‌లోని అబోటాబాద్ కు చెందిన ఒసామా.. ఒకానొక సమయంలో ప్రపంచంలో నెం.1 ఉగ్రవాదిగా చెలామణి అయ్యారు. అయితే ఆయన చనిపోయాక ఆయన కుటుంబం ఏమైంది? బిన్‌లాడెన్ కు ఎంత మంది పిల్లలు? వారంతా ఉగ్రవాదులుగా మారారా? అతని మరణం తరువాత కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారనే ప్రశ్న చాలా మందికే వచ్చి ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.
ఒసామా బిన్ లాడెన్‌కు ఎంత మంది పిల్లలు ఉన్నారు?
ఒసామా బిన్ లాడెన్ కు 24 మంది పిల్లలు. 16 సంవత్సరాల వయస్సులో ఒసామా పూర్తిగా మతపరమైన వ్యక్తిగా మారిపోయాడు. 17 ఏళ్ల వయసులో తన బంధువును పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆ తరువాత మరో నాలుగు వివాహాలు చేసుకున్నాడు. అతను 2011 లో హత్యకు గురైనప్పుడు, అతని భార్యల వయస్సు 28 నుంచి 62 సంవత్సరాల మధ్య వారు. అలాగే అతని పిల్లల వయస్సు 3 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుంది.
ఒసామా పిల్లలు ఏమయ్యారు?
అబోటాబాద్‌కు రాకముందు, ఒసామా బిన్ లాడెన్ సూడాన్‌లో నివసించేవాడు. తన పిల్లలను సైతం ఉగ్రవాద కార్యకలాపాల్లో దింపేందుకు ప్రయత్నించాడు. దీంతో అతని పిల్లలు కలత చెందారు. పెద్ద కొడుకు ఇంటి నుంచి పారిపోయి, తిరిగి రాలేదు. ముగ్గురు కుమారులను అమెరికా హత్య చేసింది. అతని కుమార్తెలలో ఒకరు ప్రసవ సమయంలో మరణించారు. ఇది కాకుండా, అతను మరణించిన ఒక సంవత్సరం తరువాత, అతని ముగ్గురు భార్యలను పాకిస్తాన్‌లో ఖైదు చేయగా ఒక భార్య సహా ఏడుగురు పిల్లలను ఇరాన్‌లో నిర్బంధంలో ఉంచారు. ఒసామా మిగిలిన పిల్లలు, భార్యల గురించి పెద్దగా తెలియదు.