దళిత స్పీకర్‌ను అవమానించడం సబబేనా
జగదీశ్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందే…..ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, మార్చి14(ఆర్‌ఎన్‌ఎ):
బిఆర్‌ఎస్ పార్టీ అల్లరి చేయడం ద్వారా సమస్యలను డైవర్ట్ చేయాలని చూస్తోందని, తమ తప్పుల కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తోందని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. అసెంబ్లీలో స్పీకర్‌ను అవమానించిన జగదీశ్ రెడ్డి నీతి వాక్యాలు పలుకుతున్నారని మండిపడ్డారు. చేసిన తప్పులను ఒప్పుకోకుండా బిఆర్‌ఎస్ కూడి సిగ్గు లేకుండా వ్యవహరిస్తోందని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేయడం సరైనదేనని అన్నారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ.. బిఆర్‌ఎస్ నేతలు నిరసనలు చేయడం మరింత దుర్మార్గమని అన్నారు. గతంలో బిఆర్‌ఎస్, కెసిఆర్ ప్రభుత్వం దళితులకు విలువ ఇవ్వలేదని ఆయన అన్నారు. ఇప్పుడు తమ స్పీకర్‌ను బిఆర్‌ఎస్ అవమానించిందని మండిపడ్డారు. కెటిఆర్‌కు దళితులపై ఉన్న ప్రేమేంటో ప్రజలంతా గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న విూరు స్పీకర్‌కు ఇస్తున్న విలువ ఏంటో
తెలుసుకోవాలని పేర్కొన్నారు. దళిత స్పీకర్‌ను అవమానించి, అంబేడ్కర్ విగ్రహం ఎదుట ధర్నా చేస్తాననడం సిగ్గు చేటని అన్నారు. కెటిఆర్‌కు దళితులపై ఎలాంటి చిత్తశుద్ధి లేదని.. రెచ్చగొట్టేలా మాట్లాడి అసెంబ్లీని స్తంభింప చేస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి యాగీని ప్రజలు చూస్తున్నారని, వీరికి తగిన బుద్ది చెప్పడం ఖాయమని షబ్బీర్ అన్నారు.