కోవిడ్ లాంటి మళ్లీ మహమ్మారి వచ్చేస్తోంది?
– బాంబ్ పేల్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
– ఇప్పటికే ఆసుపత్రులకు పరుగు తీస్తున్న చైనీయులు
– మన దేశానికి ఎప్పుడైనా రావొచ్చట
కొన్నేళ్ల కిందట కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎలా వణికించిందో చూశాం. కోట్లాదిమంది ప్రాణాలు తీయడం చూశాం. ఆ మహమ్మారి ప్రభావానికి ఇప్పటికీ ఎంతోమంది ఇంకా రకరకాల జబ్బుల బారిన పడుతూనే ఉన్నారు. ఆ మహమ్మారిని మరిచిపోవడం అంత సులభం కాదు. వాస్తవానికి ప్రజల్లో కోవిడ్ భయం ఇంకా పూర్తిగా తొలగిపోలేదనే చెప్పవచ్చు. ఆ భయం ఇంకా తొలగిపోకముందే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక బాంబు పేల్చింది. మరో మహమ్మారి ముప్పు తప్పదని అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అనడమే కాదు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్అథనామ్. ఆ ముప్పు త్వరలో రావచ్చు లేదా ఆలస్యంగా రావొచ్చు. రేపే రావొచ్చు లేదా 20 ఏళ్ల తరువాత రావొచ్చు.
రాబోయే మహమ్మారి అంటు వ్యాధి అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆమధ్య ఒమిక్రాన్ వేరియంట్ జనాన్ని భయపెట్టంది. వచ్చే పదేళ్లలో కొవిడ్ తరహా మరో మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టే ముప్పుందని ‘ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్’ అనే ఆరోగ్య విశ్లేషణ సంస్థ హెచ్చరించింది. అందుకు అవకాశాలు 27.5% ఉన్నట్లు తెలిపింది. జనాభా పెరుగుదల, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ ప్రయాణాల పెరుగుదల, జంతువుల నుంచి మనుషులకు సోకే సామర్థ్యమున్న కొత్త వ్యాధుల పుట్టుక వంటివి అందుకు కారణమవుతాయని పేర్కొంది. మహమ్మారిని గుర్తించిన 100 రోజుల్లోగా సమర్థ వ్యాక్సిన్లను ఆవిష్కరించగలిగితే మాత్రం దాన్ని నివారించే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో చైనాను కొత్త రకం వైరస్ వణికించింది.
చైనా పేరు వార్తల్లో వినిపిస్తే చాలు ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. కోవిడ్ -19 మహమ్మారి తర్వాత చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపింది. కొత్తగా పుట్టుకొచ్చిన హ్యుమన్‌మోటాన్యూమో వైరస్‌తో చైనా ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రుల ఎదుట క్యూ కట్టారంటూ వార్తలు వచ్చాయి. ఈ వ్యాధి వ్యాప్తిపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే హ్యూమన్ మెటానిమోవైరస్ వ్యాప్తి పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని డీజీహెచ్‌ఎస్ విజ్ఞప్తి చేసింది. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. దాంతో ఇండియా జనం ఊపిరి పీల్చుకున్నారు. మరి ఈ కొత్త మహమ్మారి ఎప్పుడు వస్తుందో, ఎన్ని లక్షలమంది ప్రాణాలు తీస్తుందో తెలియదు.