400 ఎకరాలు కొంటే… అంతే..కేటీఆర్ మాస్ వార్నింగ్
హైదరాబాద్, నిర్దేశం:
రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించే తీరు ఏ మాత్రం బాగోలేదని కేటీఆర్ ఫైరయ్యారు. విద్యార్థులను, ప్రకృతిని రేవంత్ ప్రభుత్వం నానా ఇబ్బందులు పెడుతోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఓ వైపు తెలంగాణ హైకోర్టు ఛీవాట్లు పెడుతున్నా.. ప్రభుత్వం తీరు మాత్రం మారడం లేదని మండిపడ్డారు. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రేవంత్ సర్కార్ తీరు మారదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి అంటే బాస్ కాదని.. ప్రజా సేవకుడని కేటీఆర్ అన్నారు. అర్థరాత్రి బుల్డోజర్లతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోకి ఎందుకు వెళ్తున్నారని నిలదీశారు. ఇప్పటికే హైడ్రాపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంలో విద్యార్థులను మంత్రులు చులకనగా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఫైరయ్యారు. రేవంత్ సర్కార్ నిర్మించే ఫ్యూచర్ సిటీకి 14 వేల ఎకరాలు ఉండగా హెచ్‌సీయూ లో ఉన్న భూమిని ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. హెచ్‌సీయూ లో వన్యప్రాణులు లేవని ఎలా చెబుతారని కేటీఆర్ ప్రశ్నించారు. దయచేసి ప్రభుత్వం అమ్మకానికి పెట్టే కంచె గచ్చిబౌలి 400 ఎకరాలను ఎవరు కొనవద్దని అన్నారు. ఇప్పుడు కంచె గచ్చిబౌలి భూములను ఎవరు కొన్న తప్పకుండా ఇబ్బందులు పడాల్సి వస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చేది తమ ప్రభుత్వమేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాలపై ఇదే తమ కమిట్ మెంట్ అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అతిపెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎవరైనా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కొంటే మళ్లీ వెనక్కు తీసుకుంటామని కేటీఆర్ తేల్చిచెప్పారు. అద్భుతమైన పార్క్ గా మార్చి హెచ్‌సీయూకు కానుకగా ఇస్తామని కేటీఆర్ చెప్పుకొచ్చారు.రేవంత్ ప్రభుత్వానిది రియల్ ఎస్టేట్ ఆలోచన అని తీవ్ర ఆరోపణలు చేశారు. హెచ్‌సీయూ భూములపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే తాము ఉద్యమం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ప్రభుత్వ భూములంటే ప్రజలవే అని.. సీఎం ధర్మకర్త మాత్రమేనని అన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిందిపోయి.. ప్రభుత్వ పెద్దలు ఇష్టమొచ్చినట్లుగా చేస్తామంటే కుదరదని కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికైనా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై రేవంత్ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన చెప్పారు.