హైడ్రా కొత్త లోగో రెడీ

హైడ్రా కొత్త లోగో రెడీ

హైదరాబాద్, నిర్దేశం:
హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ, ప్రకృతి విపత్తుల నిర్వహణకు ఏర్పాటు చేసిన హైడ్రా ఇకపై కొత్త లోగోతో కార్యకలాపాలను కొనసాగించనుంది. ఇప్పటి వరకూ ఈవీడీఎం లోగోతోనే పనిచేసిన హైడ్రా లోగో మార్చింది. హైదరాబాద్ నగరాన్ని సూచించేలా హెచ్ అక్షరంపై నీటి బొట్టు ఉన్న లోగోను రూపొందించారు. చెరవులను కాపాడుకుంటూ, జల సంరక్షణ చేపడుతూ హైదరాబాద్ ను విపత్తుల నుంచి రక్షించుకుందామనే సూచకంగా కొత్త లోగోను తీర్చిదిద్దారు.కొత్త లోగోను హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారికంగా ఆమోదించారు. హైడ్రా కార్యకలాపాలు, సిబ్బంది యూనిఫామ్, వాహనాలపై నూతన లోగోను ముద్రించనున్నారు. హైడ్రా అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో కొత్త లోగోను అప్డేట్‌ చేశారు.
బతుకమ్మ కుంటలోనే బతుకమ్మ ఉత్సవాలు వచ్చే బతుకమ్మ ఉత్సవాల నాటికి బతుకమ్మ కుంటను సిద్ధం చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. బతుకమ్మ కుంటకు సంబంధించిన కోర్టు వివాదం మంగళవారం పరిష్కారమయ్యిందన్నారు. బుధవారం హైడ్రా కమిషనర్ అంబర్ పేటలోని బతుకమ్మ కుంటను సందర్శించారు. స్థానికుల సమక్షంలో బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను వేద మంత్రిచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.యుద్ధ ప్రాతిప‌దిక‌న ఈ చెరువు పున‌రుద్ధర‌ణ‌, అభివృద్ధి, సుంద‌రీక‌ర‌ణ ప‌నులు జ‌ర‌గాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ చెరువును పున‌రుద్ధరిస్తే ప‌రిస‌రాల‌న్నీ ఆహ్లాద‌క‌రంగా మారుతాయ‌ని అన్నారు.

ప‌నుల‌కు స‌హ‌క‌రించాల‌ని స్థానికుల‌ను కోరారు. ఈ కార్యక్రమానికి స్థానికులు పెద్ద‌యెత్తున హాజ‌ర‌య్యారు. అభివృద్ధి ప‌నుల‌కు పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌ని స్థానికులు క‌మిష‌న‌ర్‌కు హామీ ఇచ్చారు.ఫిర్యాదు స్వీక‌రించిన 24 గంట‌ల్లోనే మురుగు స‌మ‌స్యకు హైడ్రా ప‌రిష్కారం చూపింది. మేడ్చల్-మ‌ల్కాజిగిరి జిల్లా దుండిగ‌ల్ మండ‌లం మ‌ల్లంపేట‌లోని రామ‌చంద్రయ్య కాల‌నీకి మురుగు ముప్పును తొల‌గించింది. చెన్నం చెరువు నుంచి రేళ్లకుంట‌కు వెళ్లే కాలువ‌కు మ‌ధ్యలో ఆటంకాలు సృష్టించ‌డంతో రామ‌చంద్రయ్య కాల‌నీలో కొంత భాగం మురుగు ముప్పును ఎదుర్కొంది.మీట‌రుకు పైగా ఇళ్లు మురుగులో మునిగిపోవ‌డంతో అక్కడి నివాసితులు ఇళ్లను ఖాళీ చేయాల్సి వ‌చ్చింది. మురుగు నీటిలో మా ఇళ్లు నీట మునిగాయ‌ని.. నెల రోజులుగా ఇళ్లు ఖాళీ చేసి బ‌య‌ట త‌ల‌దాచుకుంటున్నామ‌ని రామ‌చంద్రయ్య కాల‌నీ వాసులు హైడ్రా ప్రజావాణిలో సోమ‌వారం ఫిర్యాదు చేశారు.

మురుగు నీటి సమస్య
దుండిగ‌ల్ మున్సిపాలిటీలోని చెన్నం చెరువుకు నిజాంపేట మున్సిపాలిటీ మురుగు నీరు వ‌చ్చి చేరుతోంద‌ని.. ఆ నీరు బొల్లారం మున్సిపాలిటీ ప‌రిధిలోని రేళ్లకుంట‌కు చేరాల్సి ఉండ‌గా ఆటంకాలు ఏర్పడ్డాయ‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. రామ‌చంద్రయ్య కాల‌నీకి ప‌క్కన లే ఔట్ వేసిన వారు కాలువ‌ను మూసేయ‌డంతో ఈ ఇబ్బంది త‌లెత్తింద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత అధికారుల దృష్టికి ఈ స‌మ‌స్యను తీసుకెళ్లినా ప్రయోజ‌నం లేక‌పోయింద‌ని వాపోయారు.ఈ ఫిర్యాదును గూగుల్ మ్యాప్స్‌తో పాటు శాటిలైట్ ఇమేజీల‌లో ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స‌మ‌స్యను వెంట‌నే ప‌రిష్కరించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం హైడ్రా అధికారులు అక్కడ‌కు చేరుకుని మురుగు కాలువ‌ను పున‌రుద్ధరించారు.దీంతో రామ‌చంద్రయ్య కాల‌నీలో నిలిచిన మురుగు నీరు బ‌య‌ట‌కు వెళ్లింది. ఏం చేయాలో దిక్కుతోచ‌ని ప‌రిస్థితిలో హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదు చేయ‌గా 24 గంట‌ల‌లోపే ప‌రిష్కారం ల‌భించ‌డం ప‌ట్ల రామ‌చంద్రయ్య కాల‌నీ వాసులు హ‌ర్షం వ్యక్తం చేశారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »