మహిళల బలోపేతం చేయడానికి హుస్నాబాద్ ఇన్నోవేషన్ పార్క్
కోహెడ, నిర్దేశం:
స్వయం సహాయక సంఘాల మహిళలను బలోపేతం చేయడానికి హుస్నాబాద్ ఇన్నోవేషన్ పార్క్ ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టరు ఎం. మను చౌదరి తెలిపారు.
కోహెడ మండలంలోని సముద్రాల గ్రామ రైతు వేదికకు సమీపంలో సుమారు 11 ఎకరాల భూ విస్తీర్ణంలో హుస్నాబాద్ ఇన్నోవేషన్ పార్క్ ఏర్పాటు కొరకు ముందస్తు పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హైదరాబాదులోని ఐటీ హబ్ కొన్ని స్టార్టప్ కంపెనీలు హుస్నాబాద్ ఇన్నోవేషన్ పార్కులో పలు యూనిట్లలో ఇక్కడ స్థాపించి స్థానిక ఎస్ ఎచ్ జి మహిళలకి ఉపాధి అందించనున్నట్లు తెలిపారు. ఈ పార్క్ నిర్మాణ పనులు ఐటీ హబ్ ఆవేశ సస్టేనబిలిటీ ఫౌండేషన్ వారి అధ్వర్యంలో లో అతి త్వరలో నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు. ఈ పార్క్ లో జ్యూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్, పేపర్ ప్లేట్స్, ప్లాస్టిక్ వేస్ట్ తో టైల్స్ ఇటుకల తయారీ, ప్లాస్టిక్ రహిత వాటర్ బాటిల్ తయారీ ఇతరత్రా పరిశ్రమలు నెలకొల్పి స్థానిక ఎస్ ఎచ్ జి మహిళలకి ఉపాధి అందించడం తో పాటు తయారి వస్తువులకు వ్యాపార లావాదేవిలు సైతం చూపించడం జరుగుతుందని తెలిపారు. ఈ పార్క్ కోసం విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రణాళిక రూపొందించి ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి కనెక్షన్ ఇవ్వాలని విద్యుత్ శాఖ ఏ ఈ కి తెలిపారు. నీటి కొరకు బోరు బావులు తవ్వించాలని నీటి పడని ఎడల మిషన్ భగీరథ పైప్ లైన్ వేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి కాగానే భూమి పూజ చేసి పార్క్ పనులు మొదలు పెట్టాలని సూచించారు. భూ సమస్యలు ఎదురైతే రెవెన్యూ అధికారులు పరిష్కరించాలని తెలిపారు.
కలెక్టర్ వెంట ఆర్డీవో రామ్మూర్తి, అడిషనల్ డిఅర్డిఓ మదుసుదన్, ఆవేశ సస్టేనబిలిటీ ఫౌండేషన్ ప్రతినిధి అక్షయ్, తహశీల్దార్ సురేఖ, ఆర్ఐ. సురేందర్ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.