నిర్దేశం, హైదరాబాద్: తెలంగాణలో పండగ అంటే సుక్క, ముక్క లేకుండా ఉండదు. అందునా దసరా అంటే.. వేరే లెవల్ ఉంటుంది. రాష్ట్రంలో పెద్ద పండగ బతుకమ్మ-దసరా. ఈ పండగకు దాదాపుగా కుటీంబీకులకు ఒక చోట చేరి రచ్చ చేస్తారు. పండగకి కొత్త బట్టలు ఎంత ముఖ్యమో.. ఇక్కడ మందు కూడా అంతే ముఖ్యం. దసరా పండుగ ప్రారంభం అవుతుందంటే వారం రోజుల నుంచే మందు బాబులకు అసలైన పండుగ మొదలైంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దసరా పండుగకు 15 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయి.
దసరాకు ముందుగానే..
దసరా పండగకు మద్యం ఎక్కువగా అమ్ముడవుతుందని ఊహించిన వ్యాపారులు ముందుగానే స్టాక్ తెచ్చి పెట్టుకున్నారు. అనుకున్నట్లుగానే తెచ్చిన స్టాక్ మొత్తం సేల్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2,620 వైన్ షాపులతోపాటు వెయ్యి కంటే ఎక్కువగా బార్లు, క్లబ్లు, పబ్లు ఉన్నాయి. అంతటా దసరా సందడి కనిపించింది.
వీటిన్నింటికి దసరా ముందు రోజ అంటే శుక్రవారమే దాదాపుగా 205 కోట్ల రూపాయల స్టాక్ ఎక్సైజ్ డిపోల నుంచి దుకాణాలకు అందిందని గణాంకాలు తెలుపుతున్నాయి. మిగతా రోజులతో పోలిస్తే దసరా పండుగ రోజుల్లో మద్యం అమ్మకాలు 20 నుంచి 25 శాతం ఎక్కువ ఉంటాయి. దానికి అనుగుణంగానే ముందుగానే ఎక్కువ చేరింది. ఇక, అక్టోబర్ 10వ తేదీన అయితే ఏకంగా 139 కోట్ల రూపాయల మద్యం వైన్ షాపులకు చేరింది.
ఇదిలా ఉండగా అక్టోబర్ ఒకటవ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు 1,057.42 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడు అయిందని అధికారులు వెల్లడించారు. అయితే ఇందులో 10.44 లక్షల కేసుల లిక్కర్, 17.59 లక్షల కేసుల బీరు అమ్ముడు పోయిందట. ఇందులో ఈ నెల 10వ తేదీ వరకు 852.4 కోట్ల రూపాయల విలువైన 8.36 లక్షల కేసుల లిక్కర్, 14.53 లక్షల కేసుల బీరు సేల్ అయినట్లు అధికారులు తెలిపారు.