నిర్దేశం, హైదరాబాద్ః పరీక్ష పెట్టకపోతే గొడవ.. ఎప్పుడు పెడతారని? పరీక్ష పెడితే నిరాశ.. ఎక్కడ వాయిదా పడుతుందోనని? గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన ఇది. రెండుసార్లు ప్రిలిమ్స్ రాసిన తర్వాత వాయిదా పడింది. ముచ్చటగా మూడోసారి ప్రిలిమ్స్ రాసి ఎట్టకేలకు మెయిన్స్ కు అయితే వచ్చారు కానీ, ఉద్యోగం వచ్చేదాక ఉంటుందా, ఊడుతుందా అన్న దిగులే ఎక్కువుంది. పరీక్ష హాలుకు పోతున్నారు కానీ, ఎవరి ముఖాల్లో ఆనందమే కనిపించడం లేదు, కనీసం పరీక్ష రాస్తున్న ఆతృతా లేదు. అందరి ముఖాల్లోనూ నివురుగప్పిన నిరాశే. బహుశా.. ఇంతటి విచిత్ర పరిస్థితి మన దేశంలో మరే పరీక్షకు రాకపోయి ఉండొచ్చు. అది కూడా రాష్ట్ర పరిధిలోని అతిపెద్ద పరీక్షకు ఇంతటి దుస్థితి రావడం దౌర్బాగ్యమే.
ఎన్నో ఏళ్ల తర్వాత వస్తున్న పరీక్ష. ఎన్నో ఆశలతో ఎన్నో రాత్రులు నిద్రకోర్చి సిద్ధమయ్యే వేలాది అభ్యర్థులు. కానీ, ఏం లాభం? గత రెండేళ్లుగా పరీక్షపై నీలి నీడలే కొనసాగుతున్నాయి. కేసీఆర్ హయాంలోనే కోర్టు కేసులతో ప్రిలిమ్స్ రాసిన తర్వాత మొదటిసారి పరీక్షే రద్దైంది. ఆ తర్వాత మళ్లీ ప్రిలిమ్స్ అయిపోయాక ప్రభుత్వం మారిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ మొదటి నుంచి పరీక్ష పెట్టింది. అంతా సజావుగానే జరుగుతుందున్న సమయంలో జీవో 29 జిజ్జు పెట్టింది. పరీక్ష నిర్వహణలో సామాజిక న్యాయం పాటించడం లేదని, జీవో 29ని రద్దు చేసిన తర్వాతే పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు రోడ్లపైకి వచ్చారు. అయినా ప్రభుత్వం మెయిన్స్ నిర్వహించేందుకు సిద్దమైంది. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి కూడా. అయినా ఏం లాభం.. గత అనుభవాలు, ప్రస్తుత పరిస్థితులు అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
గ్రూప్ 1పై 14కు పైగా కేసులు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఒకవేళ మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన తర్వాత తీర్పులొస్తే అమలు ఎలా అంటూ అభ్యర్థులలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అందుకే తీర్పుల అనంతరమే పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు నేటికీ డిమాండ్ చేస్తున్నారు. కేసులు కొలిక్కి వచ్చేవరకు పరీక్షలు నిర్వహించడం సమజంసమే కదా. ఇది కాకుండా ఫైనల్ కీలో వచ్చిన తప్పులు వచ్చాయి. వాటిపై కూడా పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం అవుతోంది. గ్రూప్ 1 మీద ఇన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ.. కనీసం వాటికి ప్రభుత్వం నుంచి కానీ టీజీపీఎస్సీ సమాధానం రావడం లేదు. గ్రూప్ 1 పరీక్షపై ఇది అనేక అభ్యంతరాలను రేకెత్తిస్తోంది.
ఈ ఏడాది జూన్ 9న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు 3.02 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో మెయిన్స్ పరీక్షలకు 31,382 మంది అర్హత సాధించారు. అయితే మెయిన్స్ పరీక్షకు ఇందులో 10 వేల మంది హాజరు కాకపోవడం గమనార్హం. అభ్యర్థుల్లో ఉన్న అసంతృప్తి, భయాలను ఈ గౌర్హాజరు బట్టబయలు చేస్తోంది. ఇకపోతే.. గ్రూప్-1పై హైకోర్టులో నేటికీ పలు కేసులు విచారణ జరుగుతున్నాయి. హారిజాంటల్ రిజర్వేషన్లపై వేసిన పిటిషన్ నవంబర్ 7న, ఫైనల్ కీపై, జీవో-29పై వేసిన కేసులు ఈ నెల 27 విచారణకు రానున్నాయి. స్థానికతపై వేసిన పిటిషన్ కేసు అక్టోబర్ 3న విచారణకు రానున్నది. వీటన్నిటినీ దాటి అభ్యర్థులకు ఆఫర్ లెటర్ ఇచ్చే వరకు గ్రూప్1 పరీక్ష ముందుకు వెళ్తుందా?