రెండు ముక్కలుగా గ్రేటర్ హైదరాబాద్
హైదరాబాద్, నిర్దేశం:
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను రెండు ముక్కలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనివల్ల అభివృద్ధి ఈజీ అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా హైదరాబాద్ మహానగరాన్ని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వరకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.అందులో భాగంగా ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధి దాదాపు 625 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నది. ఇక మిగిలిన మున్సిపాలిటీలను వీలినం చేస్తే జీహెచ్ఎంసీ పరిధి 2వేల చదరపు కిలోమీటర్లకు పెరుగుతుంది. అప్పుడు దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ నిలుస్తుంది. అప్పుడు ఓఆర్ఆర్ వరకు ఉన్న నగరాన్ని ఒక్కటే కార్పొరేషన్ గా ఉంచడమా లేక రెండు భాగాలుగా విభజించడమా అనే విషయంలో ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే పరిపాలన సౌలభ్యం కోసం రెండు భాగాలుగా చేయడమే ఉత్తమమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయమై ఢిల్లీ, ముంబై నగరాల విస్తీర్ణం, ఆ కార్పొరేషన్లు పనిచేసే తీరుపై ఆధ్యయనం చేయడానికి ఒక బృందం అయా నగరాల్లో పర్యటించేందుకు సిద్ధమైంది. కాగా ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం దాదాపు ఖరారు అయినప్పటికీ మొత్తాన్ని ఒక కార్పొరేషన్ గా ఉంచడమా? లేక రెండుగా విభజించడమా అనేదానిపై చర్చ సాగుతోంది. ఇక మున్సిపాల్ ఎన్నికల కోసం ఓఆర్‌ఆర్ అవతల ఉన్న మున్సిపాలిటీల్లో డిలిమిటేషన్ (వార్డుల పునర్విభజన) చేమాలని ప్రభుత్వం భావిస్తోంది.
దానిలో భాగంగా ఇప్పటికే ఆ ప్రక్రియను మొదలు పెట్టింది. అయితే ఒఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను మాత్రం గ్రేటర్ పరిధిలోకి తెచ్చే ఉద్ధేశంతో అక్కడ ఎలాంటి డిలిమిటేషన్ మొదలు పెట్టలేదు. మరోవైపు ఓఆర్‌ఆర్ పరిధిలో, ఓఆర్‌ఆర్ బయట ఒకే విధమైన అభివృద్ధి జరగాలనే ఉద్ధేశంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కు వేర్వేరుగా ఇద్దరు కార్యదర్శులను నియమించారు.గ్రేటర్ ను విస్తరించడంలో భాగంగానే ఇద్దరు సెక్రటరీలను నియమించినట్లు తెలుస్తోంది. ఓఆర్ఆర్ వెంట ఉన్న 51 గ్రామాలను ఓఆర్‌ఆర్ లోపలి మున్సిపాలిటీల్లో కలుపుతూ గతేడాది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రేటర్ విస్తరణ తప్పదనే సంకేతాలు ఇచ్చినట్లయింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 158 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో ఓఆర్‌ఆర్ లోపల 28 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు.. ఓఆర్‌ఆర్ కు, ఆర్ఆర్ఆర్ కు మధ్య 18 మున్సిపాలిటీలు వాటి అవతల మొత్తం 130 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే ఢిల్లీని 2012లో పరిపాలన సౌలభ్యం కోసమని నార్త్, సౌత్, ఈస్ట్ అని మూడు భాగాలుగా విభజించి మూడు కార్పొరేషన్లుగా ప్రటించారు. అయితే ఆ తర్వాతా 2022లో తిరిగి మూడింటిని ఒకే కార్పొరేషన్ కిందకు తీసుకువచ్చారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ విస్తీర్ణం ప్రస్తుతం 1,400 చదరపు కీలోమీటర్లు. దీనివల్ల ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం, ట్రాఫిక్ సమస్యలు, పారిశుధ్య నిర్వహణ వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. మరొవైపు నగర విస్తీర్ణం వల్ల అభివృద్ధి త్వరిత గతిన సాగుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడాతాయన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే హైదరాబాద్ నగరం , ఢిల్లీ ని ఒకే రీతిన చూడలేమని, దేశానికి ఢిల్లీ రాజధాని కావడంతో పాటు ఓఆర్ఆర్ వరకు ఉన్న హైదారాబాద్ ను చూస్తే అది ఢిల్లీ తక్కువ విస్తీర్ణంలో ఉంటుంది. కనుక గ్రేటర్ హైదరాబాద్ ను రెండు భాగాలుగా విభజిస్తే పారిపాలన సౌలభ్యానికి మంచిదన్న అభిప్రాయం ఉంది. మొత్తాన్ని రెండుగా విభజించడం రెండు ఒకేలా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా త్వరలోనే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.