తెలంగాణ రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3 నుంచి నామినేషన్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ ఉండగా.. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇక ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఎన్నికల సంఘం పేర్కొంది. దీంతో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులందరూ పెద్ద ఎత్తున ప్రచారంలో మునిగిపోయారు. నిజానికి చాలా మంది కొంత కాలం నుంచే ప్రచారం చేస్తున్నారు. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులూ దూకుడుగానే ప్రచారం నిర్వహించారు. అందులో ఒకరు.. భవిష్యత్ లో ఐపీఎస్ ర్యాంక్ పొందే అవకాశం ఉన్న ప్రస్తుత డీఎస్పీ మధనం గంగాధర్.. తన పదవికి రాజీనామా చేసి ప్రజా సేవ కోసం ఎన్నికల రంగంలోకి దిగారు.
ముందు నుంచి ప్రచారంలో ముందే
గత మూడు నెలలుగా ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో గంగాధర్ విస్తృత పర్యటనలు చేస్తున్నారు. నిజానికి నాయకుడు అన్ని చోట్లకు వెళ్లడు. ఆయన మనుషులో లేదంటే ఆయన పార్టీకి చెందిన నాయకులో ఓటర్ల దగ్గరకు వెళ్తుంటారు. కానీ, గంగాధర్ మాత్రం నియోజకవర్గం మొత్తం ఇప్పటికే స్వయంగా పర్యటించారు. నిజానికి ఈ నియోజకవర్గంలో 13 జిల్లాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు అన్ని ప్రాంతాలకు గంగాధర్ స్వయంగా తిరిగారు. ప్రాంతాలో పాటు.. అనేక సంఘాలను ప్రభుత్వ ఉద్యోగులను నిరుద్యోగులను విద్యార్థులను కలుస్తున్నారు. మిగిలిన పార్టీలు, మిగిలిన అభ్యర్థుల కంటే ముందు వరుసలో ఆయన దూసుకుపోతున్నారు.
భిన్నంగా వినూత్నంగా ప్రచారం
గంగాధర్ ప్రచార శైలి చాలా భిన్నంగా సాగుతోంది. అందరిలా కాకుండా, తాను వెళ్లిన చోట తనకు మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ జిల్లాల్లో ఉన్న అన్ని బార్ కౌన్సిల్ల నుంచి ఆయన మద్దతు సంపాదించారంటే ఏ స్థాయిలో పర్యటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కేవలం ప్రచారం మాత్రమే కాకుండా.. తమ సమస్యల కోసం నిరసన చేస్తున్నవారికి అండగా కూడా నిలిచారు. పదుల సంఖ్యలో నిరసనలకు హాజరై.. ఎన్నికల్లో వారి గొంతు కూడా వినిపిస్తానని, ప్రభుత్వం వరకు వారి సమస్యలను చేరుస్తానని గంగాధర్ మాటిచ్చారు. ఇక విద్యార్థులను కలిసినప్పుడు తన రాజకీయ ప్రచారాన్ని పక్కన పెట్టి విద్యార్థులకు భవిష్యత్ పట్ల అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు డీఎస్పీ గంగాధర్. నిజానికి ఆయన కొన్ని చోట్ ఓటు గురించి అభ్యర్థించపోయినా.. ఆయన వ్యవహార శైలి నచ్చి ప్రజల నుంచే ఓట్లు వేస్తామని మద్దతు లభిస్తోంది.
గర్వించదగ్గ గతం మరింత ఆకట్టుకుంటోంది
నిజానికి 26 ఏళ్ల పోలీసు ఉద్యోగం చేశార గంగాధర్. రాజకీయ నాయకుడిగా ఇది ఆయనకు బాగా కలిసి వస్తోంది. పోలీసు అధికారిగా ప్రజల్లో ఆయన తెచ్చిన చైతన్యం, శాంతిభద్రతల పర్యవేక్షణతో పాటు ప్రజలకు న్యాయం అందించడంలో ఒక అధికారిగా ఉత్తమంగా పని చేశారు. నేటికీ ఆయన గతంలో పని చేసిన పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు ఆయనను గుర్తు చేసుకుంటే పులకించిపోతుంటారు. సోషల్ మీడియాలో కూడా ఆయనకు వారి నుంచి మద్దతు, ప్రచారం లభిస్తోందంటే.. అధికారిగా ఆయన చేసిన సేవలకు నిదర్శనం. గంగాధర్ ను అమితంగా ఆకట్టుకుంటున్న మరొక అంశం ఏంటంటే.. ఆయన పుట్టిపెరిగిన పరిస్థితి. అడుక్కునే కులవృత్తిలో పుట్టిన గంగాధర్ కు.. ఆయన పుట్టేటప్పటికి తన కుటుంబ పరిస్తితి కూడా అలాగే ఉంది. పొట్ట కూటి కోసం గంగాధర్ చేయని పని లేదు. అంతటి కష్టంలో కూడా చదువు పట్ల ఆసక్తి పెంచుకుని, కేవలం 22 ఏళ్లకే ఎస్ఐగా ఉద్యోగం సాధించాడు. ఓటర్లను ఇది భావోద్వేగానికి గురి చేస్తోంది.
రాజకీయంతో మరింత సేవ చేయాలని
అత్యంత గడ్డు పేదరికాన్ని అనుభవించిన గంగాధర్ కు సమాజంలో మామూలు ప్రజల కష్టాలు తెలుసు. అంతే కాదు, దాన్ని అధిగమించిన వ్యక్తిగా.. ప్రజల కష్టాలకు ఉపాయాలేంటో కూడా ఆయనకు తెలుసు. పోలీసు ఉద్యోగం చేస్తుండగానే ఎంతో మంది యువతకు తనకున్న శక్తి మేరకు ఉద్యోగాలు ఇప్పించేవారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి చేస్తున్నదానికి ఎక్కడో బౌండరీ అడ్డు వస్తుందని ఆయన భావించారు. రాజకీయం అయితే ఏ పరిధీ లేకుండా.. అంతకు 100 రెట్లు ఎక్కువ చేయొచ్చనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అంటారు. దీనితో పాటు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని చైతన్యం చేయడమే కాకుండా.. ఎన్నికల సంఘాన్ని పలుమార్లు కలిసి తేదీలు పొడగించేలా చేశారు. ప్రజాస్వామ్యం పట్ల ఆయన బాధ్యతను తెలియజేస్తోంది.
కాంగ్రెస్ నుంచి టికెట్ వచ్చే ఛాన్స్?
గంగాధర్ క్వాలిటీస్ తెలిసీ అధికార పార్టీ కూడా ఆయనపై కన్నేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ లో ఇప్పటికే ఈయనకు టికెట్ ఇచ్చే విషయమై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నిజానికి సామాజిక న్యాయం అంటూ కాంగ్రెస్ అగ్రనేత కొంత కాలంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ, తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం అంతా రెడ్లే కనిపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన రాహుల్.. కిందికులాలకు న్యాయం చేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ లెక్కన చూసుకున్నా, ఓ మంచి అభ్యర్థని చూసుకున్నా గంగాధర్ కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల బరిలో ఉన్న మిగిలిన అభ్యర్థులతో పోలిస్తే.. డీఎస్పీ గంగాధర్ మంచి ఎంపిక అని ఓటర్లు సైతం భావిస్తున్నారు. మరి కాంగ్రెస్ తాను చెప్తున్న సామాజిక న్యాయానికి కట్టుబడి గంగాధర్ ను తమ అభ్యర్థిగా నిలుపుకుంటుందా.. లేదంటే అలవాటు ప్రకారం మరో రెడ్డికి టికెట్ ఇస్తుందా అనేది చూడాలి.