కులాంతర వివాహం చేసుకున్న మాజీ ఎంపీ.. కుటుంబాన్ని బహిష్కరించిన గిరిజన తెగ
నిర్దేశం, భువనేశ్వర్ః
ఒడిశాకు చెందిన మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీ సామాజిక వెలివేతకు గురయ్యారు. భాత్రా గిరిజన వర్గానికి చెందిన ఆయన.. ఇటీవల కులాంతర వివాహం చేసుకున్నారు. బ్రాహ్మణ కులానికి చెందిన సుశ్రీ సంగీత సాహూను మాజీ ఎంపీ పెళ్లాడారు. కులాంతర వివాహం చేసుకున్న ప్రదీప్ మాఝీపై.. భాత్రా తెగకు చెందిన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఆయన్ను కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఆ మాజీ ఎంపీ ఇంట్లో జరిగే వేడుకలకు హాజరుకాబోమని భాత్రా సంఘం తీర్మానించింది.గోవాలో జరిగిన ఓ ప్రైవేటు సెర్మనీలో.. సుశ్రీ సంగీతను మాజీ ఎంపీ ప్రదీప్ పెళ్లాడినట్లు భాత్రా సంఘం పేర్కొన్నది. ఇటీవల మాజీ ఎంపీకి చెందిన సోదరి సంజూ మాఝీ కూడా పెళ్లి చేసుకున్నదని, ఆమెను ఓ బ్రాహ్మణ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారని, దీన్ని ఖండిస్తున్నట్లు అఖిల భారతీయ ఆదివాసీ భత్రా సొసైటీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. బ్రాహ్మణ కులస్థులను పెళ్లి చేసుకున్న మాఝీ కుటుంబాన్ని 12 ఏళ్ల పాటు కులం నుంచి వెలివేస్తున్నట్లు ఆ సంఘం తెలిపింది.తమ తీర్మానంలో భాగంగా.. భాత్రా గిరిజన తెగకు చెందిన ఎవరు కూడా .. ప్రదీప్ మాఝీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు వెళ్లకూడదని పేర్కొన్నారు. భాత్రా సంఘం తీసుకున్న నిర్ణయం పట్ల మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీ కానీ ఆయన కుటుంబసభ్యులు కానీ స్పందించలేదు. 2009లో నబరంగ్‌పూర్ నియోజకవర్గం నుంచి ప్రదీప్ మాఝీ ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ సీటుపై ఆయన ఆ విజయం సాధించారు. అయితే గత ఏడాది ఆయన బీజూ జనతాదళ్ పార్టీలో చేరారు.