చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ లో
మహిళా మావోయిస్టు ముఖ్య నేత మృతి
– 35 ఏళ్లుగా విప్లవోద్యమంలోనే..
నిర్దేశం, చత్తీస్ గడ్ :
చత్తీస్ గడ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకురాలు రేణుక అలియాస్ చైతు అలియాస్ సరస్వతి మరణించారు. 35 ఏళ్లుగా విప్లవోద్యమంలో పని చేస్తున్న సరస్వతిని పోలీసులు టార్గెట్ చేసారు. ఆమె కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. కాగా దంతేవాడ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మహిళా మావోయిస్టు సరస్వతిగా ఎస్పీ గౌరవ్ రాయ్ వెల్లడించారు. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రేణుక అలియాస్ చైతు అలియాస్ సరస్వతి పేరుతో మావోయిస్టు కార్యకర్యలపాలను నిర్వహించిందన్నారు. చైతు అలియాస్ సరస్వతిది వరంగల్ జిల్లా కడవెండి గ్రామం. ఆమె 35 ఏళ్ల క్రితం పార్టీలో వెళ్లి పోవడంతో తిరిగి ఇంటి ముఖం చూడ లేదు.
LLB చదివిన సరస్వతి తిరుపతిలో న్యాయవాదిగా ఉంటూ మహిళా సంఘంలో పనిచేస్తూ చంద్రబాబు అలిపిరి దాడి అనంతరం రేణుక@ చైతు మావోయిస్టు పార్టీలోకి పూర్తిస్థాయి కార్యకర్తగా వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ తరువాత ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డిని వివాహం చేస్తుకుందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే.. ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు నేత శాఖమూరి అప్పారావు సహచరీ నీ గా కొనసాగుతూ విప్లవోద్యమంలో స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. సరస్వతి అలియాస్ రేణుక తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేసే పదవి విరమణ చేశారు. మృతురాలుకు ఇద్దరు సోదరులు ఉన్నారు. ఒక సోదరుడు న్యాయవాదిగా పనిచేస్తుండగా మరొక సోదరుడు దేశ రాజధాని ఢిల్లీలో జర్నలిస్టుగా పనిచేస్తున్నట్టు సమాచారం. కడవెండి గ్రామం అంటేనే రజాకార్లకు సైతం గుండెల్లో వణుకు పుట్టించిన గ్రామం. విప్లవాల ఖిల్లా గా పేరుంది. రేణుక మరణంతో కడవెండి గ్రామం లో విషాద ఛాయలు నెలకొన్నాయి.