ఫిరాయింపు చట్టం భయం రేవంత్ కూ పట్టుకుంది
– బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరలేదట
– స్వయంగా అసెంబ్లీలో చెప్పిన సీఎం రేవంత్
– కండువాలు కప్పి ఆహ్వానించిన రేవంత్
– ఫిరాయింపు చట్టం భయంతో యూటర్న్
నిర్దేశం, హైదరాబాద్ః
వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు చచ్చింది అన్నట్టు.. రాజకీయ నాయకులు చేసే తప్పులకు ఏదో గాలి వాన అంటుకుంటూనే ఉంటుంది. ఇష్టారీతిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కున్న కేసీఆర్ కు ఎట్టకేలకు ప్రజలు బుద్ధి చెప్పి ఫాం హౌజ్ కు పరిమితం చేయబోయారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మసులుకోవాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కేసీఆర్ లాగే గడ్డి తినడానికి ప్రయత్నించింది. కానీ, అధికారంలో ఉండగానే ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, చట్టం సెగ తగులుతుందేమోనన్న భయంతో ఒక్కసారి ఆట యూటర్న్ తీసుకుంది.
నిన్నమొన్నటి వరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు బుకాయించే ప్రయత్నం చేశారు. అయితే, ఈ సెగ ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాకింది. స్వయంగా అసెంబ్లీలోనే రేవంత్ వివరణ ఇచ్చాడు. కాంగ్రెస్ పార్టీలో విపక్ష ఎమ్మెల్యేలు ఎవరూ చేరలేదని నిండు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పాడు. దీన్ని బట్టి చూస్తుంటే.. ఫిరాయింపు చట్టం భయం రేవంత్ రెడ్డిని కూడా గట్టిగానే పట్టుకుంది. అందుకే అసెంబ్లీ సాక్షిగా తాను కండువా కప్పి చేసిన ఫిరాయింపుల్ని అసలు జరగనే లేదని బుకాయిస్తున్నాడు.
అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి చేరడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది. ఒకవైపు ప్రజలకు నీతులు చెప్తూనే మరొకవైపు బహిరంగంగా ఇలా పార్టీలు ఫిరాయిస్తూ రాజకీయాల్ని మరింత రొంపిగా తయారు చేస్తున్నారు. ఏమన్నా అంటే అభివృద్ధి కోసం పార్టీ మారానని అంటారు. అధికార పార్టీలోనే ఉంటే అభివృద్ధి సాధ్యం అనుకుంటే అసలు విపక్షమే అవసరం లేదు. నిజానికి అధికార పక్షానికి సేవ చేయడంలో ఎంత బాధ్యత ఉంటుందో.. అధికార పక్షంతో ముక్కు పిండి చేయించాల్సిన బాధ్యత విపక్షానికి అంతే ఉంటుంది. కానీ, విలువలను గాలికి వదిలేసి, నమ్మించి ఓటేసిన ప్రజలను వంచింది పార్టీలు మారుతున్నారు.
ఇందుకే 1985లో ఫిరాయింపుల చట్టాన్ని తీసుకువచ్చారు. అయినప్పటికీ మన రాజకీయ నాయకుల్లో మార్పు రాకపోగా.. చట్టానికి చిక్కుండా పార్టీలు మారుతున్నారు. ఒకరు, ఇద్దరు కాకుండా మొత్తం లెజిస్లేటివ్ పార్టీనే వేరే పార్టీలో కలిపేస్తున్నారు. ఈ చట్టం ప్రకారం.. మూడింటిలో రెండొంతుల మంది పార్టీ మారితే చట్టం వర్తించదు. ప్రస్తుతం ఈ ట్రెండ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ నుంచి ఈ విధానంలోనే ఎమ్మెల్యేలను లాగారు కేసీఆర్. ఇక మహారాష్ట్రంలో రెండు పార్టీలు ఇదే రకంగా చీలి బీజేపీతో జట్టు కట్టాయి. అయితే ఇలా చేయబోయి బొక్కబోర్లా పడ్డాడు రేవంత్. మెజారిటీ ఎమ్మెల్యేలు రాకపోవడంతో ఇప్పుడు బుకాయిస్తున్నాడు.