ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు

ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు

– బాంబ్ పేల్చి అమెరికా నిఘా డైరెక్ట‌ర్ తుల‌సీ గ‌బ్బార్డ్
– ఇండియాలో నిప్పు ర‌గిల్చిన గ‌బ్బార్డ్ కామెంట్స్
– ఇండియాలో హ్యాకింగ్ సాధ్యం కాద‌న్న ఎన్నిక‌ల సంఘం

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిష‌న్ (ఈవీఎం)ల‌ను హ్యాక్ చేయ‌డం గురించి దేశంలో గ‌త 20 ఏళ్లుగా అనేక విమ‌ర్వ‌లు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం మాత్రం వాటినే కొన‌సాగిస్తోంది. ఒక‌ప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు ఈవీఎంలు ఒద్దే ఒద్ద‌ని మంకు ప‌ట్టు ప‌ట్టిన బీజేపీ నేడు వాటినే కొన‌సాగించ‌డం, ఈవీఎంల‌లో ఎలాంటి లోపాలు లేవ‌ని డబ్బాలు కొట్టుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇక తాజా విష‌యానికి వ‌స్తే.. ఈవీఎంల‌ను హ్యాక్ చేయొచ్చ‌ని అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తుల‌సీ గ‌బ్బార్డ్ పేల్చిన బాంబు ఇండియాలో గ‌ట్టిగా పేలింది. భార‌త ఎన్నిక‌ల సంఘం జెట్ కంటే స్పీడుగా స్పందించి.. అబ్బ‌బ్బే అలాంటివేమీ మ‌న దేశంలో జ‌ర‌గ‌వు గాక జ‌ర‌గ‌వు. మ‌న దేశ ఈవీఎంలు వ‌జ్రం కంటే క‌ఠినంగా ఉంటాయి, ముత్యం కంటే నిక్క‌చ్చిగా ఉంటాయ‌ని నీతులు చెప్పేసింది.

మీడియాతో గబ్బర్డ్ మాట్లాడుతూ.. ఈవీఎంలు చాలా కాలంగా హ్యాకర్లకు హాని కలిగి ఉన్నాయని ఆధారాలు కనుగొన్నట్లు చెప్పారు. ఎన్నిక‌ల్లో ఓట్లు తారుమారు చేశారనే అనుమానం కూడా ఉందని అన్నారు. అమెరికన్ ఎన్నికల సమగ్రతను ఓటర్లు విశ్వసించగలిగేలా దేశవ్యాప్తంగా పేపర్ బ్యాలెట్ల వాడకాన్ని తప్పనిసరి చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉందని తులసి గబ్బర్డ్ అన్నారు. ఎన్నికల సంఘం వర్గాల సమాచారం ప్రకారం, కొన్ని దేశాలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగిస్తున్నాయి.

తుల‌సీ గ‌బ్బార్డ్ కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆమె వ్యాఖ్య‌లు కాంగ్రెస్ పార్టీ త‌మ వాద‌న‌కు అనుకూలంగా వాడుకుంటుంటే.. భార‌తీయ జ‌న‌తా పార్టీ మాత్రం గ‌బ్బార్డ్ వ్యాఖ్య‌ల‌కు ఇండియాకు సంబంధం లేద‌ని అంటోంది. తుల‌సీ వీడియోను కాంగ్రెస్ నేత‌లు పెద్ద ఎత్తున షేర్ చేస్తూ.. మ‌న దేశంలో ఈవీఎం హ్యాకింగ్ జ‌రుగుతోంది. కానీ బీజేపీ అబ‌ద్దాలు ఆడుతోంద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇది కాస్త పెద్ద వివాదం అవుతుండ‌డంతో ఎన్నిక‌ల సంగం రంగంలోకి దిగింది.

ఈ విష‌య‌మై ఎన్నిక‌ల సంఘం స్పందిస్తూ.. “ఇండియా, అమెరికా దేశాల ఈవీఎంలు భిన్నంగా ఉంటాయి. ప్రపంచంలోని అనేక దేశాలలో, ఇంటర్నెట్ లేదా ఇతర నెట్‌వర్క్‌లతో ఈవీఎంల‌ను ఉపయోగిస్తున్నారు. అయితే మ‌న‌దేశంలో ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ ఉండ‌దు కాబ‌ట్టి ఈవీఎంలను హ్యాక్ చేయలేము. వాటిని ఇంటర్నెట్ లేదా మరే ఇతర నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయలేము. మ‌న దేశంలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు 43 సంవత్సరాలుగా అనేక పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి” అని పేర్కొన్నారు.

ఎన్నికలు ప్రారంభమయ్యే ముందు, రాజకీయ పార్టీలు నియమించిన పోలింగ్ ఏజెంట్ల ముందు మాక్ పోల్ కూడా నిర్వహిస్తారని, దీనిలో అన్ని రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు యంత్రం సరిగ్గా పనిచేస్తుందో లేదో చూస్తారని ఎన్నికల సంఘం తెలిపింది. కమిషన్ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం, ఐదు కోట్లకు పైగా వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు సమయంలో పారదర్శకతను కాపాడటానికి వాటిని రాజకీయ పార్టీల ముందు సరిపోల్చారు. ఇప్పటివరకు ఇందులో ఎటువంటి అవకతవకలు బ‌య‌ట‌ప‌డ‌లేదు. మ‌న దేశంలో ఇప్పటివరకు ఐదు సార్వత్రిక ఎన్నికలు, దాదాపు 150 అసెంబ్లీ ఎన్నికలు ఈవీఎంల ద్వారా జ‌రిగాయి. వాటి ఫలితాలు దేశంలో 44 సార్లు అధికార మార్పులకు దారితీశాయి.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »