సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదా
డిసెంబర్ 27న ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్
సింగరేణి (గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదాపడ్డాయి. సింగరేణి అభ్యర్థణ మేరకు డిసెంబర్ 27న ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎలక్షన్స్‌ను వాయిదావేయడానికి అంగీకరించింది. నవంబర్ 30వ తేదీలోపు ఎన్నికల తుది జాబితాను రూపొందించి కార్మిక శాఖకు సమర్పించాలని సింగరేణి యాజమాన్యాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని పేర్కొంది. ఈ మేరకు రేపటిలోగా హామీ పత్రం సమర్పించాలని స్పష్టం చేసింది.
అక్టోబర్‌లోగా గుర్తింపు సంఘానికి ఎన్నికలు నిర్వహించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ సింగరేణి యాజమాన్యం అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.కాగా, అక్టోబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని సింగిల్ జడ్డి ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేయాలని కోరడం లేదని, ఆ గడువును పొడిగించాలని మాత్రమే కోరుతున్నామని యాజమాన్యం తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా శాసనసభ ఎన్నికల విధుల్లో తలమునకలయ్యారని, ఈ పరిస్థితుల్లో అక్టోబర్ నాటికి ఎన్నికలను నిర్వహించడం కష్టమని వివరించారు. ఆరు జిల్లాల్లో 15 యూనియన్లకు 40 వేల మంది కార్మికులు ఉన్నారని, అసెంబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికల నిర్వహణకు సహకరించలేమని కలెక్టర్లు చెప్పారని తెలిపారు. 15 యూనియన్లల్లో 13 యూనియన్లు ఎన్నికల వాయిదాకు అంగీకరించాయని చెప్పారు. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వర్కర్స్ యూనియన్లను ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.