– వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకున్న డీఎస్పీ గంగాధర్
– ఆ వెంటనే కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలోకి
– అడుక్కునే కుటుంబం నుంచి నేడు డీఎస్పీ వరకు
– హృదయాన్ని కదిలించే డీఎస్పీ గంగాధర్ స్టోరీ
నిర్దేశం, హైదరాబాద్: డీఎస్పీ మధనం గంగాధర్ స్టోరీ వింటే ‘ట్వెల్త్ ఫెయిల్’ సినిమా గుర్తుకు వస్తుంది. సరిగ్గా చెప్పాలంటే, ఆ సినిమాను మించి హృదయాన్ని కదిలించే స్టోరీ ఆయనది. ఒక్కపూట అన్నం కోసం పోరాటం చేసే బీదరికంలో ఉన్న కుటుంబాల్లో చదువుకోవడం ఎంతటి కఠినమైందో కొత్తగా చెప్పేది కాదు. అటువంటి కుటుంబంలో పుట్టిన గంగాధర్.. పగలు అడుక్కుంటూ రాత్రిపూట బడిలో చదువుకుంటూ.. ఇంతింతి వటుడింతై అన్నట్లుగా పట్టువదలని కసితో కేవలం 22 ఏళ్ల వయసులోనే, అది కూడా మొదటి ప్రయత్నంలోనే ఎస్ఐ కొట్టారు. 26 ఏళ్ల పాటు 12 స్టేషన్లలో ఎస్.హెచ్.ఓగా చివరిగా డీఎస్పీగా విధులు నిర్వహించి, వ్యవస్థలో మార్పుకు రాజకీయమే సరైన మార్గమని తన ఉద్యోగానికి వాలెంటరీ రిటైర్మెంట్ ప్రకటించి కరీంనగర్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగారు.
జీవితమే ఓ పోరాటం
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ కు చెందిన వ్యక్తి మధనం గంగాధర్. ఆయన కుటుంబం ఆర్థికంగానే కాదు సామాజికంగానూ చిధిమేసిన బిక్షాటనే వృత్తిగా బతికే సంచార జాతికి చెందిన కుటుంబం. ఐదుగురు సంతానంలో గాంగాధర్ మొదటివాడు. ఆర్మూర్ బస్టాండ్ వెనుక ఇల్లు. అక్కడే నాన్నతో కలిసి చిత్తుకాగితాలు వేరుకుంటూ, అడుక్కుంటూ సాగుతున్న జీవనం. జాతర్లలో బెలూన్లు, బొమ్మలు అమ్మారు. మామూలు సమయాల్లో ఐస్ క్రీం లాంటివి కూడా అమ్మారు. అయితే, మంచి ఉద్యోగం రావాలంటే రోజూ పత్రికలు చదవాలన్న ఉపాధ్యాయుడి సూచన మేరకు.. బస్టాండులో ఎవరైనా న్యూస్ పేపర్ చదువుతుంటే దూరం కూర్చొని హెడ్డింగ్స్ చదివేవాడు. అక్కడే ఈనాడు పత్రిక ఏజెంట్ శ్రీకాంత్ పరిచయం కావడం అనంతరం పేపర్ బాయ్ గా ప్రయాణం మొదలైంది. నెలకు రూ.150 జీతం. ఇది పెద్ద సంపాదన కాకపోయినా అడుక్కునే, చిత్తుకాగితాలేరుకునే పని తప్పింది. ఇదే గంగాధర్ జీవితంలోని మొదటి అడుగు.
మొదటి అటెంప్ట్ లోనే ఎస్ఐ ఉద్యోగం
గంగాధర్ చదువును పేదరికం ఆపలేకపోయింది. చదువుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని ఆయన వదలలేదు. ఎంతో కసితో, పట్టుదలతో చదివారు. అలా 1997లో నిజామాబాద్ జీజీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ సీటు సాధించడంతో ఆయన జీవితం మలుపు తిరిగింది. ఆ సమయంలోనే అంటే 1998లో మొదటి ప్రయత్నంలోనే ఎస్ఐ జాబ్ కొట్టారు. అప్పటికి గంగాధర్ వయసు కేవలం 22 సంవత్సరాలే.
సుమారు 200 అవార్డులు
ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వ్యవస్థపరమైన బాధ్యతే కాకుండా నైతిక బాధ్యతతో కూడా పని చేశారు. అందరిలాగే ఉద్యోగ జీవితంలో అనేక ఎత్తుపల్లాలు గంగాధర్ జీవితంలో ఉన్నాయి. పల్లాలను పక్కన పెట్టి, ఎత్తులను మాత్రమే లెక్కించి ఒక్కో మెట్టు ఎదిగారు. ఎన్నో అడ్డంకులు, ఈసడింపులు, అవమానాలు, వెలివేతల నడుమ మానవత్వాన్ని వెతికి మరీ తన పని కొనసాగించారు. మతపరమైన ఘర్షణను నివారించడంలో, చికెన్ గున్యా వ్యధి సోకిన 3,000 మందికి ఓకే రోజు చికిత్స అందించడంలో, పేద విద్యార్థులకు ప్రైవేటు సంస్థల్లో ఉపాధి కల్పించడంలో.. ఇలా ఎన్నో పనులు చేశారు. ఒక ఉద్యోగిగా కంటే మానవతావాధిగా స్పందిస్తానంటారు ఆయన. ఇందుకే ఆయనకు ‘కఠిన సేవా పథకం’, ‘ఉత్తమ సేవా పథకం’ ‘ముఖ్యమంత్రి సర్వోన్నత పథకం’ లాంటివి 200 అవార్డులు అందుకున్నారు.
సమాజ మార్పు కోసమే రాజకీయంలోకి
ఇంత చేసినా ఏదో అసంతృప్తి. తన ఉద్యోగం బాగానే ఉంది. కానీ సమాజం మీద పెట్టుకున్న కలలే.. కేవలం కలలుగానే మిగిలిపోతున్నాయనే నిరాశ ఎంతో కాలంగా వేధిస్తోందట. పోలీస్ వ్యవస్థ సరిగానే ఉన్నప్పటికీ దానిని నడుపుతున్న వ్యక్తులు సరిగా లేకపోవడం తనను నిరాశకు గురి చేసిందట. సమాజ మార్పు కోసం పరితపించే తన కలలను నిజం చేయాలంటే, కలలు కనడం కంటే ప్రత్యక్ష ప్రయత్నమే మంచిదని భావించి తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు గంగాధర్.
రాజకీయం అంత ఈజీ కాదు
చాలా మంది పోలీసులు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ, రాజకీయాల్లో నిలవలేకపోయారు. నిన్నీమధ్య ఐపీఎస్ ప్రవీణ్ కుమార్, ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణల రాజకీయ ఎంట్రీ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. ఉద్యోగాల్లో గొప్పగా పని చేసిన ఈ ఇద్దరి పట్ల ప్రజల్లో కూడా మంచి భావన, ఆదరణ ఉండేది. కానీ, రాజకీయంలో అనుకున్నంతగా రాణించలేకపోయారు. అలా అని పోలీసులు రాజకీయాల్లో రాణించలేరని కారు. అలా రాణించినవారూ ఉన్నారు. డీజీపీగా పని చేసి జే.పూర్ణచంద్రరావు ప్రస్తుతం బీఎస్పీలో కొనసాగుతున్నారు. బహుశా.. వారి ఆగమనం తర్వాత రాజకీయాల్లోకి వచ్చే పోలీసులకు కొంత అనుకూలత, కొంత ప్రతికూలతను ఏర్పరిచింది. మరి మధనం గంగాధర్ ఎంత వరకు సక్సెస్ అవుతారనేది చూడాలి.