ఆపరేషన్ సింధూర్ పేరు ఎందుకు పెట్టారో తెలుసా..
హైదరాబాద్, నిర్దేశం:
పహల్గామ్‌దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్‌కు ‘సింధూర్’ అని నామకరణం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిలో కళ్లముందే భర్తలను కోల్పోయిన భార్యలకు చేసే న్యాయమే ఆపరేషన్ సింధూర్. కేంద్రం ఆ అర్థంలోనే ఈ ఆపరేషన్‌కు ఆ పేరు ఖరారు చేసింది. అదీగాక కుంకుమ పువ్వుకు ప్రసిద్ధి గాంచిన కశ్మీర్ లోయలో పహల్గామ్ ఉగ్రదాడులతో పాకిస్తాన్ రక్తం పారించింది. పాక్ ఉగ్రదాడికి జవాబుగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకార దాడులు చేపట్టింది భారత సైన్యం.పహల్గామ్‌లో రక్తం పారించిన ఉగ్రవాద దాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. దాడి జరిగిన తర్వాత బిహార్‌లో ప్రధానమంత్రి వార్నింగ్ ఇచ్చినట్టుగానే వారి స్థావరాల్లో వారికి సమాధి కట్టేశారు. కొన్ని రోజుల నుంచి పక్కా సమాచారాన్ని సేకరించి ఉగ్రస్థావరాల లెక్కలు తీసి మరీ టార్గెట్ చేసింది భారత్. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సాయుధ దళాలు దాడులు చేశాయి.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సీరియస్‌గా రియాక్ట్ అయింది. దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను ఒక్కరిని కూడా విడిచిపెట్టేది లేదని ప్రధాని మోదీ తీవ్రస్వరంతో హెచ్చరించారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా భారత సైన్యానికి చెందిన వివిధ రంగాలతో, అధికారులతో, దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన విభాగాలతో ప్రధాని, హోం, డిఫెన్స్ మంత్రులు విడతలు విడతలుగా చర్చలు జరుపుతూ వచ్చారు. ప్రతిపక్షాలు సహా ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా సరే.. తమ మద్దతు ఉంటుందని అండగా నిలిచాయి. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. 9 ఉగ్రవాద స్థావరాలను తుడిచిపెట్టేస్తూ భారత్ వైమానిక దాడులు నిర్వహించింది.పహల్గామ్ దుర్ఘటన తాలూకు గాయాలు ఇంకా మానక ముందే, భారత్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన పోరాట పటిమను నిరూపించింది. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న సానుకూల స్పందనలు, సంపూర్ణ సహకారం లభిస్తుండటంతో, ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేసే వరకు భారత్ వెనకడుగు వేయదని స్పష్టమవుతోంది. ఇది కేవలం ప్రతీకార చర్య కాదు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ఆత్మగౌరవం నినదించిన సందర్భం! ఈ దాడులు ఎక్కడపడితే అక్కడ కాకుండా, పహల్గామ్ దాడికి సూత్రధారులుగా భావిస్తున్న 9 నిర్దిష్ట ఉగ్ర స్థావరాలపైనే జరిగాయి. మన గడ్డపై హింసను సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్న కీలక ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా సైన్యం ముందుకు కదిలింది. పాకిస్థాన్ సైనిక స్థావరాల జోలికి పోకుండా, కేవలం ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిన చోట్లనే మన బలగాలు ప్రహరించాయి. అత్యంత పక్కా ప్రణాళికతో, ప్రెసిషన్ స్ట్రైక్స్‌తో ఈ ఆపరేషన్ విజయవంతమైంది.
ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం తన సత్తాను మరోసారి నిరూపించింది. దేశ భద్రతకు భంగం వాటిల్లితే ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రహరించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ చర్య ద్వారా చాటిచెప్పింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు ఇది స్పష్టమైన, గట్టి హెచ్చరిక. ఉగ్రవాద చర్యలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భారత్ తేల్చి చెప్పింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో భారత్ ఎప్పటికీ వెనకడుగు వేయదని ఆపరేషన్ సింధూర్ స్పష్టం చేసింది.