ఆపరేషన్ కాగర్ ను ఆపాలని డిమాండ్
రేవంత్, కేసీఆర్… ఒకటే మాట…
హైదరాబాద్, నిర్దేశం:
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. పదేళ్లుగా వీరిమధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. పార్టీ సిద్దాంతం పరంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తారు. కానీ, నియోజకవర్గాల పునర్విభజన విషయంలో రేవంత్‌రెడ్డికి కేటీఆర్ మద్దతు తెలిపారు. ఇప్పుడు మావోయిస్టుల విషయంలో కేసీఆర్ మద్దతు తెలిపారు.
తెలంగాణ రాజకీయాల్లో అసాధారణ పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ ప్రత్యర్థులైన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మావోయిస్టు సమస్యపై ఒకే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘ఆపరేషన్ కగార్’ను నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని ఇద్దరూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.తెలంగాణ–చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కేంద్ర బలగాలు ‘ఆపరేషన్ కగార్’ పేరుతో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని తీవ్రతరం చేశాయి. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు దాదాపు 30 మంది నక్సలైట్లు హతమైనట్లు సమాచారం. అయితే, ఈ ఆపరేషన్ అమాయక గిరిజనులు, సామాన్య ప్రజలపై ప్రభావం చూపుతోందని రేవంత్, కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని తక్షణం నిలిపివేయాలని ఇద్దరూ డిమాండ్ చేశారు.మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నారని, కేంద్రం కూంబింగ్ ఆపరేషన్లు, కాల్పులను ఆపి చర్చలకు ముందుకు రావాలని కేసీఆర్ వరంగల్‌లోని ఎల్కతుర్తి బీఆర్‌ఎస్ సభలో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ తరఫున కేంద్రానికి లేఖ రాస్తామని ఆయన ప్రకటించారు. మరోవైపు, శాంతి చర్చల కమిటీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి, కేంద్రాన్ని కాల్పుల విరమణకు ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను సామాజిక కోణంలో చూస్తామని, శాంతి–భద్రతల సమస్యగా కాదని రేవంత్ స్పష్టం చేశారు.నక్సలిజం సమస్యపై చర్చలకు అనుభవం ఉన్న మంత్రి జానారెడ్డి సలహాలు తీసుకుని, ఇతర మంత్రులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సునిశితంగా వ్యవహరిస్తూ, కేంద్రంతో సమన్వయం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కేసీఆర్ కూడా ఈ అంశాన్ని బలంగా లేవనెత్తి, కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.సాధారణంగా ఒకరి విధానాలను మరొకరు తీవ్రంగా విమర్శించుకునే రేవంత్, కేసీఆర్ మావోయిస్టు సమస్య విషయంలో ఒకే గొంతుతో మాట్లాడటం తెలంగాణ రాజకీయాల్లో అరుదైన సంఘటన. ఈ ఏకాభిప్రాయం రాష్ట్రంలో శాంతి ప్రక్రియను బలోపేతం చేస్తుందా లేదా రాజకీయ లబ్ధికి ఉపయోగపడుతుందా అనేది చర్చనీయాంశం. ఈ అంశంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలిమావోయిస్టు సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలనే రేవంత్, కేసీఆర్ ఉద్దేశం తెలంగాణలో శాంతి ప్రక్రియకు కొత్త దిశను ఇవ్వవచ్చు. ఈ సమస్యకు హింసాత్మక పరిష్కారం కాకుండా, చర్చల ద్వారా మార్గం సుగమం చేయాలనే ఇద్దరి నేతల ఆలోచన రాష్ట్రంలో సామాజిక సమస్యల పరిష్కారానికి ఒక ముందడుగుగా పరిగణించబడుతోంది. ఈ ఏకాభిప్రాయం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో రాబోయే రోజులు తేల్చనున్నాయి.