వీరి వీరి గుమ్మడిపండు.. వీరిది ఏ పార్టీ?

నిర్దేశం, హైదరాబాద్: గోడ మీద పిల్లి అని అంటారు. కానీ, మన రాజకీయ నాయకులను చూస్తే పిల్లి సైతం అవమానంతో ఉరి వేసుకుంటుంది. ఎప్పుడు ఎక్కడ అవకాశం దొరికితే అటువైపు దూకేస్తారు మన నేతలు. అసలు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో వారికి కూడా తెలియదు. అందుకే, తమ కారులో అన్ని పార్టీల కండువాలు పెట్టుకుని తిరుగుతారు. తాజాగా తెలంగాణలో దీనిని మించిన ఓ రాజకీయం నడుస్తోంది. పది మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీ గేటు దాటి గాంధీ భవన్ కు వెళ్లారు. అక్కడ కొందరికి ప్రభుత్వ పదవులు కూడా అందుతున్నాయి. అయితే వారిది ఏ పార్టీ అంటే క్లారిటీ రావడం లేదు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలు గెలుచుకుంది. దీంతో 2/3 వంతు అంటే అటుఇటుగా 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే కానీ వర్కౌట్ కాదు. అంతుకు తక్కువ అయితే ఫిరాయింపు చట్టం కొరడా పడుతుంది. దీంతో.. అవసరాన్ని బట్టి తాము ఏ పార్టీ వాళ్లమో చెప్తున్నారు. మొన్నామధ్య కౌశిక్ రెడ్డితో వివాదం నేపథ్యంలో తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకున్నారు శేరి లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. ఇక అంతకు ముందు తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనేనని ఖైరాతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం అన్నారు.

అంటే, మాటకో పార్టీ ఉందన్నమాట. తమ ఎమ్మెల్యేలకు ప్రభుత్వ పదవులు ఏ లెక్కన ఇస్తున్నారని గులాబీ పార్టీ గుండెలు బాదుకుంటున్నా లెక్కనైనా చేయడంలేదు హస్తం పార్టీ. బహుశా.. షేక్ హ్యాండ్ ఇచ్చేశాం, తన్నుకు చావండని అనుకుంటున్నారేమో కాంగ్రెస్ నేతలు. గతంలో కాంగ్రెస్ నేతలను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నప్పుడు నీతుల మీద కోతలు కోసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను అచ్చం కేసీఆర్ లాగే చేర్చుకుంటోంది. దరిద్రం ఏంటంటే.. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో అతి తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండడంతో దాదాపుగా సీఎల్పీ విలీనమైపోయినంత పనైంది. కానీ, ఇప్పుడు కారు అంతకు మించి గట్టిగానే ఉంది. పది మందిని చేర్చుకున్నా ఫిరాయింపు చట్టం అడ్డొస్తోంది.

ఇక్కడ మరొక ఆసక్తికర విషయం ఏంటంటే.. రాజీనామా చేసి వస్తే కానీ పార్టీలో చేర్చుకోనని చెప్పిన రేవంత్ రెడ్డే.. పార్టీ మారిన వారికి పదవులు ఇస్తున్నారు. ఇంతకీ వాళ్లు ఏ పార్టీ వారని ఇస్తున్నారు? బహుశా రేవంత్ రెడ్డి దృష్టిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అయుండొచ్చు. కోర్టు మందలించినప్పుడు మాత్రం గులాబీ ఎమ్మెల్యేలు. వీరి అనర్హతపై బీఆర్ఎస్ వేసిన పిటిషన్ విచారణ ముగిసి ఓ తీర్పు వస్తే కానీ వీరిది ఏ పార్టీయని తేలేలా లేదు. అలా అని తీర్పు వస్తుందా అంటే.. ఆ తీర్పు వచ్చే సరికి మళ్లీ ఎలక్షన్లు వస్తాయేమోననే అనుమానం కూడా ఉంది. తెలంగాణ నేతలు మహా ముదుర్లు అయిపోయారు. ఫిరాయింపుల చట్టానికి కూడా చెమట పట్టిస్తున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!