తీయని మాటలతో సైబర్‌నేరగాళ్ల బురిడీ
అమాయకులను దోచుకుంటున్న సైబర్‌నేరగాళ్లు
ఓ వ్యక్తి నుంచి రూ. 17 లక్షలు కాజేసిన వైనం
హైదరాబాద్, నిర్దేశం:
సైబర్ నేరగాళ్లు రోజుకో పంథాను ఎంచుకుంటున్నారు. అమాయకులను ఫోన్లు చేసిన మొదట తీయని మాటలతో వారిని మభ్యపెడుతున్నారు. తీరా వారి మాటలను నమ్మిన తరువాత వారికి కావాల్సిన వివరాలు తెలుసుకొని నగదును కాజేస్తున్నారు. తాజాగా తెలుగులో మాట్లాడి సైబర్ మోసగాళ్లు ఓ వ్యక్తి నుంచి 17 లక్షలు గుంజేశారు. తెలుగులో మాట్లాడే వ్యక్తి నుంచి బాధితుడికి ఫోన్ కాల్ వచ్చింది. మోసగాడు తెలుగులో మాట్లాడటం వల్ల అవతలి వ్యక్తి చెప్పేది నిజమే అనుకున్నారు. మంచి ఆఫర్ దొరికిందని సంబరపడ్డాడు. సాధారణంగా చీటర్స్ తెలుగు సరిగ్గా మాట్లాడరు కదా మాయలో పడ్డాడు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును పరిశీలించి, మోసగాళ్లు వాయిస్ ట్రాన్స్‌లేటర్ ఉపయోగించి మోసం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. డిసెంబర్‌లో, 31 ఏళ్ల బాధితుడికి ఫేస్‌బుక్‌లో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడంతో.. దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత మోసగాడు వాట్సాప్‌కు వచ్చి తనను ‘‘టాన్యా’’గా పరిచయం చేసుకున్నాడు. ప్లిఫ్‌కార్ట్, కుకాయిన్ వంటి బ్రాండ్‌లను ప్రమోట్ చేసే పార్ట్-టైమ్ ఉద్యోగ అవకాశాన్ని వివరించాడు. వాటిని లైక్ చేయడం, చెల్లింపులు చేయడం వంటి పనులను చేసి కమీషన్‌తో రిఫండ్ అందుకోవచ్చని నమ్మించాడు. దీంతో మొదట చిన్న మొత్తాల్లో చెల్లింపులు చేసి రిఫండ్ అందుకున్న బాధితుడు, నమ్మకం పెరిగాక పెద్ద మొత్తాలు చెల్లించసాగాడు. చివరికి అతను 17 లక్షల రుపాయలు కోల్పోయాడు. ఎవరు ఫోన్ కాల్స్ చేసినా ఈ తరహా ఆఫర్లు, టాస్కులు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అనుకోని పరిస్థితులలో డబ్బులు చెల్లిస్తే వెంటనే 1930కు కాల్స్ చేసి ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.