సైన్యం పేరుతో సైబర్ నేరగాళ్ల టోపి
హైదరాబాద్, నిర్దేశం:
సైబర్ మోసగాళ్లకు అన్నీ అవకాశాలే. ఏ సందర్భం వచ్చినా బ్యాంక్ ఖాతాలు ఇచ్చి డబ్బులు జమ చేయమని ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను అలాగే క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇందు కోసం వాట్సాప్ ను వినియోగించుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని వాట్సాప్‌లో ఒక సందేశం వైరల్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం భారత సైన్యం కోసం బ్యాంకు ఖాతాను తెరిచిందని, సైన్యానికి సహాయం చేయడానికి ప్రజల నుండి ఆర్థిక సహాయం కోరిందని ఆ వాట్సాప్ సందేశం సారాంశం. ఫేస్‌బుక్, వాట్సాప్, మరే ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్న సందేశంలో కనీసం ఒక్క రూపాయి అయినా జమ చేసి దేశభక్తిని చాటుకోవాలని సూచిస్తోంది.
ఈ డబ్బుతో ఆయుధాలు కూడా కొనుగోలు చేస్తామని అందులో పేర్కొన్నారు. ఈ అంశం కేంద్రం దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించింది. అది సైబర్ నేరగాళ్ల కుట్ర అని.. మొత్తం ఫేక్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకటించింది. PIB తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా వైరల్ పోస్టుల గురించి ఖండించింది. వాట్సాప్‌లో తప్పుదారి పట్టించే సందేశం వైరల్ అవుతోందని, అందులో భారత సైన్యాన్ని ఆధునీకరించడం, యుద్ధంలో గాయపడిన లేదా అమరవీరులైన సైనికుల కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాలో ఆర్థిక విరాళాలు ఇవ్వడం గురించి చర్చ జరుగుతోందని పిఐబి తెలిపింది. అలాంటి పోస్టులను నమ్మవద్దని తెలిపింది. నటుడు అక్షయ్ కుమార్ పేరు కూడా ఈ వాట్సాప్ మెసెజ్‌లో ఉపయోగించారు. ఈ ప్రతిపాదనకు అక్షయ్ కుమార్ ప్రధాన ప్రమోటర్‌గా ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారని.. అది కూడా పచ్చి అబద్దమని స్పష్టం చేసింది. తెలంగాణ పోలీసులు కూడా ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రకటన చేశారు.