ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాజకీయ పార్టీల హడావుడి మామూలుగా ఉండదు. కానీ ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్-కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో పరిస్థితి మరోలా ఉంది. పెద్ద పెద్ద రాజకీయ పార్టీలను వెనక్కి నెట్టి.. ఏ పార్టీకి అనుబంధం లేని అభ్యర్థులు దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. డీఎస్పీ పదవికి రాజీనామా చేసిన గంగాధర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన పులి ప్రసన్న హరికృష్ణ సహా మరికొంత మంది అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నిజానికి ఈ ఎన్నికకు సంబంధించి ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే తమ అభ్యర్థిని ప్రకటించిగా.. అధికార కాంగ్రెస్, ప్రధాన విపక్షం బీఆర్ఎస్ ఇప్పటి వరకు అభ్యర్థులను ఎంపిక చేయలేదు.
ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీ.జీవన్ రెడ్డి పదవీకాలం మార్చి చివరి వారంతో పూర్తి కానుంది. అంతకుముందే కొత్త ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే నిర్వహిస్తారా? లేనిపక్షంలో వాటి తర్వాత నిర్వహిస్తారా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల ప్రయత్నాలు మాత్రం అప్పుడే ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి నాలుగు జిల్లాల్లో అభ్యర్థులు ప్రచారంలో దూకుడుగా వెళ్తున్నారు.
అయితే, ఈ ప్రచారం మొత్తంలో డీఎస్పీ గంగాధర్ ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ఆయన ప్రచారం వినూత్నంగా సాగుతోంది. అలాగే ఆయన పుట్టి పెరిగి వచ్చిన వాతావరణం, ఆయన సాధించిన స్థాయి, ఎన్నికల కోసం ఆయన వదులుకున్న హోదా.. ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. మిగతా అభ్యర్థులకంటే విస్తృతంగా డీఎస్పీ గంగాధర్ పర్యటిస్తున్నారు. అలాగే, ఎన్నికల్లో విలువలు సైతం పాటిస్తుండడం గమనార్హం. అదేనండి, డబ్బులకో అమ్యామ్యాలకో ఓటర్లను ప్రసన్నం చేసుకోకుండా.. వారితో గడిపి, చర్చించి వారిని ఒప్పిస్తూ ముందుకు సాగుతున్నారన్నమాట. ఈ విషయమై ఓటర్లు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చిస్తుండడం విశేషం.
ఎన్నికల బరిలో డీఎస్పీ గంగాధర్ ఉత్తముడు
బీజేపీ ప్రకటించిన అభ్యర్థి సి.అంజారెడ్డితో పాటు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, కరీంనగర్ కు చెందిన డాక్టర్ బీఎన్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక కరీంనగర్ కు చెందిన ఆల్ఫోర్స్ విద్యాసం స్థల అధినేత వేం నరేందర్రెడ్డి ఈ పట్టభ ద్రుల ఎమ్మెల్సీ కోసం ఉమ్మడి నాలుగు జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. వీరంతా డబ్బులతో రాజకీయం చేసే నాయకులు. కోట్లకు పడగలెత్తిన వ్యాపారులు. వీరితో కంపార్ చేసినప్పుడు డీఎస్పీ గంగాధర్ ఉత్తమ ఎంపికగా కనిపిస్తున్నారు. సామాజికంగా అట్టడుగు వర్గమైన సంచార జాతి నుంచి రావడమే కాకుండా.. చదువుకోవడానికే పెద్ద యుద్ధం చేసిన గంగాధర్.. ఉద్యోగ జీవితంలో అత్యుత్తమ స్థాయికి వెళ్లారు. దేశంలో ప్రతిష్టాత్మకమైన ఐపీఎస్ స్థాయికి మరికొద్ది రోజుల్లో వెళ్లేవారు. అన్ని అవకాశాలు ఉన్నా.. తనకున్న సామాజిక సేవ ఆలోచనలతో అంతటి అద్భుత అవకాశాన్ని వదులుకుని ఎన్నికల బరిలోకి దిగారు. ఇది ఓటర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. తమలో నుంచి ఎదిగిన వ్యక్తి అయితేనే, గెలిచాక కూడా తమను పట్టించుకుంటాడని అనుకుంటున్నారు.
గంగాధర్ గెలుపుకు కంకణబద్ధులైన పేపర్ బాయ్స్
డీఎస్పీ గంగాధర్ నేపథ్యం పేపర్ బాయ్ నుంచి మొదలైంది. సంచార జాతికి చెందిన కుటుంబంలో పుట్టిన ఆయన.. చిన్నతనంలో ఉపాధి కోసం పేపర్ బాయ్ గా మారడంలో జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ అని గంగాధర్ అనేక సందర్భాల్లో చెప్పారు. పేపర్ బాయ్ గా ఉండడం వల్లనే జ్ణానం తెలిసిందని, ప్రపంచం తెలిసిందని అంటారయన. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూషన్స్ అసోసియేషన్ 2వ మహా సభలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ సమావేశంలో పేపర్ బాయ్స్ న్యూస్ పేపర్ వండర్స్ డిస్టిబూటర్స్ 800 మందీ పాల్గొన్నారు. తమ లాంటి బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన డీఎస్పీ గంగాధర్ ను గెలిపిస్తే, సామాన్యుల కష్టాలు తెలుస్తాయని, అందుకు తాము ఎన్నికలు ముగిసే వరకు అవిశ్రాంతంగా ప్రచారం నిర్వహిస్తామని ప్రతిజ్ణ చేశారు.
అంతటా అదే ఆదరణ
నిజానికి డీఎస్పీ గంగాధర్ ఎక్కడికి వెళ్లినా మంచి ఆదరణ లభిస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, బార్ కౌన్సిల్లు, ధర్నా స్థలాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు.. ఆయనను ఆదరించి అక్కున చేర్చుకుంటున్నాయి. గంగాధర్ కు బేషరతు మద్దతు ఇస్తున్నాయి. ఇందులో చాలా మంది ప్రత్యక్ష ప్రచారంలోకి దిగుతుండడం విశేషం. ఇప్పటికే అనేక మంది గంగాధర్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వస్తే.. అనేక మంది ప్రచారంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. నిజానికి.. ఆర్థిక ఇబ్బందులు గంగాధర్ ప్రచారానికి కొంత ఆటంకం కలిగించినా.. ప్రజల మద్దతుతో వాటిని సైతం దాటుకుని ప్రచారం నిర్వహిస్తుండడం గమనార్హం.
కాంగ్రెస్ నుంచి టికెట్?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఎన్నిక ఇదే కావడంతో.. అధికార పార్టీకి ఇది అత్యంత కీలకంగా మారింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలో ఆల్ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ, వెలిచాల రాజేందర్ లతో పాటు డీఎస్పీ గంగాధర్ లు ఉన్నారు. ఈ నలుగురిలో ఒకరికి టికెట్ రావచ్చని అంటున్నారు. ఇందులో డీఎస్పీ గంగాధర్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చాలా కష్టపడి డీఎస్పీ వరకు ఎదిగిన గంగాధర్ కు టికెట్ ఇస్తే.. పార్టీ పట్ల ప్రజల్లో సానుకూలత పెరుగుతందని కాంగ్రెస్ వర్గీయుల ఆలోచన. అలాగే, సామాజిక కోణంలో చూసుకున్నా కూడా.. సంచార జాతి నుంచి వచ్చిన గంగాధర్ కు ఇస్తే.. రాహుల్ గాంధీ చెప్తున్న బహుజన సామాజిక న్యాయానికి అర్థం ఉంటుందన్నది మరో వాదన. ఇక మరొకటి ఏంటంటే.. మిగిలిన అభ్యుర్థులతో పోలిస్తే వ్యక్తిత్వంలో, పట్టుదలలో గంగాధర్ అత్యుత్తమంగా కనిపిస్తున్నారు. ఇది కూడా కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి.. టికెట్ కన్ఫిర్మ్ అయితే, ఆ వెంటనే గెలుపు ఖాయమని చర్చ సాగుతోంది.